- పౌల్ట్రీ పరిశ్రమ ఒడిదుడుకులు, చలితో తగ్గిన ఉత్పత్తి
- మార్కెట్లో పెరిగిన డిమాండ్
- సంక్రాంతి, మేడారం జాతరకు రేట్ మరింత పెరిగే చాన్స్
కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలో చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో కొంత ధర తగ్గినప్పటికీ.. చివరి వారం నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చి.. ఇప్పుడు పీక్ కు చేరింది. కొద్ది రోజుల కిందటి వరకు రూ.240 వరకు పలికిన కిలో చికెన్ ధర.. ఇప్పుడు రూ.280 నుంచి రూ.320 వరకు పలుకుతోంది. లైవ్ కోడి రేటు రూ.170 వరకు ఉంది. సంక్రాంతి పండుగ, ఆ తర్వాత మేడారం జాతర నేపథ్యంలో చికెన్ కు డిమాండ్ ఉంటుందని, దీంతో రేట్ మరింత పెరిగే అవకాశం ఉందని, లేదంటే ఇదే రేటు స్థిరంగా ఉండొచ్చని చికెన్ షాపు నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు చికెన్ తో పాటు గుడ్డు ధర కూడా రిటైల్ మార్కెట్ లో రూ.7 నుంచి రూ.8 పలుకుతోంది.
చలితో తగ్గిన ఉత్పత్తి.. పెరిగిన డిమాండ్
చలి కాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో బాయిలర్, లేయర్ కోడిపిల్లల మరణాలు పెరగడం పౌల్ట్రీ రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. వీటి మరణాలను తగ్గించడానికి పౌల్ట్రీ రైతులు షెడ్ల చుట్టూ పరదాలు కట్టి వెచ్చదనం కల్పించేందుకు హీటర్లు, వేడిని ఇచ్చే అత్యధిక ఓల్టేజీ గల లైట్లను వినియోగిస్తున్నారు. ఇదంతా వారికి అదనపు భారంగా మారుతోంది. కోళ్లతో పాటు కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్ లోకి సప్లై తగ్గిపోయింది.
దీంతో డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరిగిపోయినట్లు చికెన్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. వారం, పదిరోజులుగా గుడ్డు హోల్‌సేల్ ధర రూ.7 ఉండగా, రిటైల్‌లో మాత్రం రూ.8కి అమ్ముతున్నారు. రాష్ట్రంలో వచ్చే సంక్రాంతి పండుగతో పాటు మేడారం జాతర, ఇతర జాతరలు ఉండడంతో చికెన్ డిమాండ్ పీక్ కు చేరే అవకాశం ఉంది. దీంతో చికెన్ రేట్లు కూడా ఇంకాస్తా పెరగొచ్చని అంటున్నారు.
దాణా, కోడి పిల్లల ధరల హైక్ కారణమే..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 50 లక్షలకు పైగా కెపాసిటీ ఉన్న కోళ్ల షెడ్స్ ఉన్నాయి. పౌల్ట్రీరంగంలో నష్టాల కారణంగా కొన్నేళ్లుగా ఉన్న కోళ్ల షెడ్లలో 15 లక్షల కోళ్లను మాత్రమే రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. కోడి పిల్లల(చిక్స్) ధరలు, ఫీడ్ ధరలు పెరగడం, ట్రేడర్ల అడ్డగోలు దోపిడీతో రైతులు సతమతమవుతున్నారు. ఈ నష్టాలను తగ్గించుకునేందుకు రైతులు కోళ్ల ఉత్పత్తిని మరింత తగ్గించడంతో మార్కెట్ లో చికెన్ డిమాండ్ పెరగడానికి కారణమవుతోంది.
చికెన్ వ్యాపారంలో ట్రేడర్లు, చికెన్ సెంటర్ల నిర్వాహకులు మాత్రం ఎవరి మార్జిన్ వారు చూసుకొని వ్యాపారం చేసుకుంటున్నారని, రేటు తగ్గినప్పుడల్లా ఆ నష్టాన్ని తామే భరించాల్సి వస్తుందని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
