దొంగల అడ్డాగా.. పైరవీల నిలయంగా ప్రగతి భవన్ 

దొంగల అడ్డాగా.. పైరవీల నిలయంగా ప్రగతి భవన్ 
  • ధరణి రైతుల కోసమా..వేల ఎకరాలు కొట్టేయడానికా?
  • సీఎం కేసీఆర్​పై ఈటల రాజేందర్​ ఫైర్​
  • దొంగల అడ్డాగా.. పైరవీల నిలయంగా ప్రగతి భవన్ 
  • ప్రాజెక్టుల కమీషన్ల కంటే ధరణి కుంభకోణమే పెద్దది

హైదరాబాద్, వెలుగు: ధరణి.. రైతుల కోసమా? లేక కేసీఆర్, ఆయన కుటుంబం వేల ఎకరాల భూములు కొట్టేయడానికి తీసుకువచ్చారా.. అని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్​ అయ్యారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలోని వెయ్యి ఎకరాల భూమి ప్రగతి భవన్ తో సంబంధం ఉన్న వ్యక్తుల ప్రమేయంతో నిషేధిత జాబితా నుంచి తొలగిపోయిందని ఆరోపించారు.  మంగళవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఈ భూములకు సంబంధించిన ఫైలు సీఎం నుంచి చీఫ్ సెక్రటరీకి, అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ కు చకచకా కదలిందన్నారు. వేల కోట్ల రూపాయల విలువచేసే వివాదాస్పద భూములు కేసీఆర్ కుటుంబం పేరు మీద రిజిస్టర్ అవుతున్నాయన్నారు. 

బేరం కుదిరితే లాక్ క్లోజ్​

సాగునీటి ప్రాజెక్టు కమీషన్ల కంటే ధరణి కుంభ కోణం పెద్దదని ఈటల ఆరోపించారు. భూములన్నీ కేసీఆర్, ఆయన కుటుంబ కబ్జాలోకి వెళ్తున్నాయని విమర్శించారు. బేరం కుదిరితే లాక్ ఓపెన్ చేస్తున్నారని, లేదంటే క్లోజ్ చేస్తున్నారని, దీని డిజైనర్ కేసీఆరేనని దుయ్యబట్టారు. ధరణి భూములపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని కేసీఆర్ ను ఈటల డిమాండ్ చేశారు. ధరణి సమస్యలు పరిష్కరించే దమ్ము లేకుంటే సీఎం సీటు నుంచి కేసీఆర్ వెంటనే తప్పుకోవాలన్నారు. భూ రికార్డులను సరిచేసే బాధ్యత నాలుగు కంపెనీలకు మార్చిన  కేసీఆర్, ఇప్పుడు ఫిలిప్పైన్స్ దేశ కంపెనీకి ఇచ్చి మన భవిష్యత్తు వారి చేతిలో పెట్టారని ఆరోపించారు.

భూరికార్డుల ప్రక్షాలన బోగస్​

భూ రికార్డులు సరిచేస్తా అని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిందంతా బోగస్ అని తేలిపోయిందని ఈటల విమర్శించారు. ధరణి సమస్యలు బయటపడే కొద్దీ కేసీఆర్ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ఆ పాపం రెవెన్యూ డిపార్ట్​మెంటు వారిదంటున్నారన్నారు. లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. భూ సమస్యలతో 24 లక్షల దరఖాస్తులు వస్తే.. కేవలం ఆరు లక్షలే పరిష్కరించారని తెలిపారు.