కాళేశ్వరం ముంపు ముమ్మాటికీ మానవ తప్పిదమే

కాళేశ్వరం ముంపు ముమ్మాటికీ మానవ తప్పిదమే

కాళేశ్వరం ముంపు మానవ తప్పిదమా ప్రకృతి వైపరీత్యమా అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపాలపై జర్నలిస్ట్ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ పాల్గొన్నారు.

నష్టపోతున్న రైతులని ప్రభుత్వం ఆదుకోవాలి

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రాజెక్టు లోపాల వల్ల ప్రజలు కోట్లాది రూపాయలు నష్టపోయారు. ప్రజలకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఇన్ని అనుభవాల తర్వాత ప్రాజెక్టులపై జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టమైందని తెలిపారు. ప్రాజెక్టుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం శాస్త్రీయ పద్దతిలో ఆలోచించాలని సూచించారు. వరదలతో సంబంధం లేకుండా పంట నష్టపోతున్న రైతులని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

మేము రాజకీయ నాయకులం మాత్రమే.. ఇంజనీర్లం కాదని ఈటల చెప్పారు. అయితే కాళేశ్వరం విషయంలో ఇంజనీర్లు చెప్పినా కేసీఆర్ వినేవాడు కాదు. నేనే డిజైనర్, నేనే సృష్టికర్త అని కేసీఆర్ అనుకునేవాడని ఈటల ఆరోపించారు. ప్రభుత్వానికి మాన్సూన్ ప్రిపరేషన్స్ పై ప్లాన్ లేదు. అందుకే వరదల వల్ల ప్రజలు నష్టపోయారని అన్నారు. ప్రాజెక్టులు కట్టడం నాతోనే స్టార్ట్ అయిందనే లాగా కేసీఆర్ మాట్లాడడం బాధాకరమని వ్యాఖ్యానించారు. నీళ్ళు కావాలని జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం అన్నారు. కాళేశ్వరమే శ్రీరామరక్ష మిగతా వాటర్ సోర్స్ అవసరం లేదని ప్రభుత్వం చెప్పడం తప్పు అని ఎమ్మెల్యే ఈటల పేర్కొన్నారు.

మేఘా కృష్ణారెడ్డి ఆస్తులను జప్తు చేయాలి..

ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ఛలో కాళేశ్వరం పిలుపునిద్దాం.. కాళేశ్వరం లోపాలపై ప్రభుత్వం విచారణ చేసినా చేయకున్నా, ప్రజల తరపున విచారణ కమిటీ వేద్దాముని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో బయటపడుతున్న లోపాలతో ప్రజలు బయపడుతున్నారు. ప్రజలందరూ శాశ్వత పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ముంపు ప్రాంతాల్లో మేం బ్రతకలేమని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం లోపాల మరమ్మత్తు ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందా? మేఘా కృష్ణారెడ్డి భరిస్తాడా అని ప్రశ్నించారు. ముంపు వల్ల మా ఊర్లు నీళ్ళల్లో బతుకమ్మ లాగా తేలుతున్నాయని ప్రజలు చెప్తున్నారని గుర్తు చేశారు.

ఇళ్లంతా నాశనమయ్యకా ప్రభుత్వం ఇచ్చే పదివేలు దేనికి సరిపోతాయని ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. కాళేశ్వరం లోపాలపై సిట్టింగ్ హై కోర్టు జడ్జితో విచారణ చేయించాలి. ప్రభుత్వం విచారణ జరపకుంటే జర్నలిస్టులు ఆ విచారణ కమిటీ వేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి క్లౌడ్ బరస్ట్ లాంటి సిల్లీ మాటలు మాట్లాడితే ఎలా? అని నిలదీశారు. కాళేశ్వరం లోపాలు తప్పించుకోవడానికే కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ అని మాట్లాడారని మండిపడ్డారు. మేఘా కృష్ణారెడ్డిని తప్పించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు.. మేఘా కృష్ణారెడ్డి ఆస్తులను జప్తు చేయాలన్నారు. ప్రజలకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం కట్టి ఇవ్వాలని ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు.

కాళేశ్వరం ముంపు ముమ్మాటికీ మానవ తప్పిదమే..

కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. మేఘాలు బద్దలు కాలేదు. మేఘా అవినీతి బద్దలైందని విమర్శించారు. కేసీఆరే ఇంజనీర్, డాక్టర్, మేధావి అని ఎద్దేవ చేశారు. కేసీఆర్ రాత్రి మెలకువగా ఉండి ఎవర్ని కుట్రలతో మోసం చేయాలనే ఆలోచిస్తాడు. కేసీఆర్ బాల్యమంతా దొంగతనాలతోనే గడిచిందని ఆరోపించారు. తెలంగాణ రాకపోతే కేసీఆర్ ఇప్పటికీ మొండా మార్కెట్ లో రెంట్ కట్టకుండా వ్యాపారం చేసేవాడు. తన అవినీతి బద్దలైతదనే కేసీఆర్ వరంగల్ వెళ్ళాడని విమర్శించారు. కాళేశ్వరం ముంపు ముమ్మాటికీ మానవ తప్పిదమే అన్నారు. రజత్ కుమార్ అనే వెదవని అరెస్ట్ చేయాలని మండిపడ్డారు.

బాసర ఐఐఐటీ మెస్ కాంట్రాక్టర్ హరీష్ రావు బందువు అని మధు యాష్కీ ఆరోపించారు. సమైక్యాంధ్ర ప్రదేశ్ లోనే యూనివర్సిటీలు బాగుండేవి. వీడయ్య సొత్తా? వీడబ్బా సొత్తా? ఇదేమైనా రాచరికం అనుకుంటున్నాడా కేసీఆర్. మేఘా ఇంజనీరింగ్ అధినేతను అరెస్ట్ చేయాలని వ్యక్తిగతంగా, కాంగ్రెస్ పార్టీ నేతగా డిమాండ్ చేస్తొన్నా అన్నారు. అవినీతి చేయకున్నా కాంగ్రెస్ నేతలపై ఈడీ నోటీసులు.. అవినీతి చేసిన కేసీఆర్ పై మౌనమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పై విచారణ చేయకపోతే ఆయన అవినీతిలో బీజేపీ భాగస్వామ్యం ఉందని ఒప్పుకోవాలి అన్నారు. ఒక న్యాయవాదిగా, తెలంగాణ పోరాటకారుడిగా, కాంగ్రెస్ నేతగా తెలంగాణ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటా అని పేర్కొన్నారు. సమైక్యాంధ్ర కంటే ఇప్పుడు రాష్ట్రంలో ధుర్బర పరిస్థితులున్నాయన్నారు. మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు కేసీఆర్ దుయ్యబట్టారు. పదవ తరగతి చదివిన వ్యక్తి విద్యాశాఖ మంత్రి అయ్యింది. చదువురాని వాళ్ళకి ప్రయివేట్ యూనివర్సిటీలు ఇచ్చాడని మధు యాష్కీ గౌడ్ ఫైర్ అయ్యారు.