కేసీఆర్ మీడియాలో నా వార్తలు రానిస్తలేరు

కేసీఆర్ మీడియాలో నా వార్తలు రానిస్తలేరు

వికారాబాద్ జిల్లా: కేసీఆర్ ను గద్దె దింపేందుకు నిరంతరం పోరాటం చేస్తామన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. వికారాబాద్ జిల్లా తాండూరులో జరుగుతున్న బీజేపీ శిక్షణ తరగతుల్లో ఈటల రాజేందర్ తోపాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు ఈటల. నాకు ఫాలోయింగ్ పెరుగుతుందనే తన పేపర్, టీవీలో రాకుండా చేశాడని గుర్తు చేశారు. ఒక్క కేసీఆర్ మీడియాలో రాకుంటే నష్టం ఏమీలేదని.. ప్రస్తుత రోజుల్లో ప్రతి వ్యక్తి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందన్నారు. యువత తలుచుకుంటే సోషల్ మీడియాలో కేసీఆర్ పని తీరును ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారన్నారు.

ఈటల రాజేందరన్న న్యూస్ టీవీల్లో, పేపర్లలో వస్తలేదనుకోవద్దని.. యువత చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోనే ఏకే 47లా ఉపయోగపడుతుందన్నారు. సోషల్ మీడియాను అడ్డంపెట్టుకుని మనం అబద్దాలు చెప్పాల్సిన అవసరంలేదని.. ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. మనం చెప్పాల్సింది సమాజానికి ఏది అవసరమో.. చైతన్యం కలిగించేలా ఉండాలని తెలిపారు.  ఒకప్పటికాలం వేరిని ..ఇప్పటి జనరేషన్ వేరన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న ఈటల రాజేందర్.. కేసీఆర్ ను గద్దె దింపి తీరుతామని చెప్పారు. అనంతరం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ..  పేదల వైద్యం కోసం కేంద్రం ఆయుష్మాన్ భారత్ ను తీసుకొచ్చిందన్నారు. చాలా దేశాలు సంక్షోభంలో ఉన్నా.. మనం స్ట్రాంగ్ గా ఉన్నామన్నారు. కరోనా టైంలో పేదలకు ఇబ్బంది లేకుండా మోడీ చూశారన్నారు.