మునుగోడులో మా సత్తా ఏంటో చూపిస్తాం

మునుగోడులో మా సత్తా ఏంటో చూపిస్తాం

సీఎం కేసీఆర్కి దుమ్ముంటే తనను అసెంబ్లీలోకి రానివ్వాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల సవాల్ విసిరారు. తనను శాసనసభలోకి రానివ్వకుండా అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్న సమాచారం కూడా బీజేపీ ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. బీఏసీ సమావేశానికి కూడా బీజేపీని ఆహ్వానించలేదన్నారు. ప్రజాస్వామ్య ముసుగులో ముఖ్యమంత్రి రాచరిక పాలన కొనసాగిస్తున్నారన్నారు. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా అణగారిన వర్గాల పక్షాన పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. మంత్రులు ఆయా శాఖల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదన్నారు. ముఖ్యమంత్రిని కలవాలన్నా మంత్రులు, ఎమ్మెల్యేలు అపాయింట్ మెంట్ తీసుకోవాల్సిందే అన్నారు. 

సీఎం కేసీఆర్ రైతులను అన్ని విధాలా మోసం చేశారని ఈటల రాజేందర్ చెప్పారు. రుణమాఫీచేయకపోవడంతో అన్నదాతలు డిఫాల్టర్లుగా మారిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో బయటి వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసే గిరిజన మహిళలను అకారణంగా అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో మౌలిక వసతులు కల్పించలేదన్నారు. తాను ఏనాడూ స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడలేదన్నారు.  మునుగోడు ఎన్నికలు టీఆర్ఎస్ కు గుణపాఠం నేర్పుతాయని ఈటల చెప్పారు.