
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ కు రాజ్యాంగం మీద విశ్వాసం, దాన్ని గౌరవించే సంస్కారం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. సీఎం కుర్చీని సొంత జాగీరులా వాడుకుంటున్నారని ఆరోపించారు. దేశ ప్రధాని రాష్ట్రానికి మూడు సార్లు వచ్చినా.. రిసీవ్ చేసుకునే సంస్కారం, మర్యాద లేని ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండిపడ్డారు. శనివారం ఈటల మీడియాతో మాట్లాడారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్నాయని తెలిసి.. హైదరాబాద్ లో తన ముఖమే కనిపించాలన్న అహంకారంతో రూ. 33 కోట్ల ప్రజా ధనాన్ని యాడ్స్ రూపంలో కేసీఆర్ ఖర్చు చేశారని తప్పుపట్టారు. బీజేపీ సమావేశాలపై నుంచి జనం దృష్టిని మళ్లించాలన్న దుర్బుద్ధితో హడావుడిగా ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ కు రప్పించుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, కర్రుకాల్చి వాత పెట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.
ఎందుకంత భయం?: రఘునందన్ రావు
బీజేపీ సమావేశాలు, సభ పెడుతుంటే టీఆర్ఎస్ ఎందుకంతగా భయపడుతోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ కు ఢిల్లీలో పార్టీ ఆఫీసు కట్టుకుంటామంటే జాగా, పర్మిషన్ ఇయ్యలేదా? అని ప్రశ్నించారు. బీజేపీ మీటింగ్స్ పై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ, అత్యుత్సాహం చూపుతున్నారని, మోడీ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు రానున్నాయన్నారు.