ఒక్కో కార్యకర్త ఒక్కో అభ్యర్థిలాగా పనిచేయాలి

ఒక్కో కార్యకర్త ఒక్కో అభ్యర్థిలాగా పనిచేయాలి
  • దుబ్బాక సీన్ హుజురాబాద్‌లో రిపీట్
  • హుజురాబాద్‌లో ఎమ్మెల్యే రఘునందన్ రావు

కార్యకర్తలు అంచెలంచెలుగా ఎదిగేందుకు సరైన వేదిక బీజేపీ అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. దుబ్బాక విజయం హుజురాబాద్‌లో కూడా రిపీట్ అవుతుందని ఆయన అన్నారు. హుజురాబాద్‌ ఉపఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు హుజురాబాద్ టౌన్ ఇన్‌చార్జ్‌‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

‘క్రికెట్‌‌లో అండర్ డాగ్ లాగా భావించే టీంలు కూడా వరల్డ్ కప్ సాధించినట్లుగా.. రాబోయే కాలంలో బీజేపీ విజయం సాధిస్తుంది. దుబ్బాకలో టీఆర్ఎస్ తప్ప ఎవరూ గెలవరని సీఎం అనుకుంటే.. అక్కడి ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారు. సీఎం కేసీఆర్, హరీశ్ రావు లాంటి నేతలున్న చోటే నేను గెలిచా. అలాంటిది ఆరుసార్లు గెలిచిన ఈటల గెలవలేరా? ఆరడుగుల బుల్లెట్లు, ట్రబుల్ షూటర్లు ఎన్ని పొంకనాలు కొట్టినా వారి ఆటలు సాగలేదు. మంత్రి పదవి కంటే ఆత్మాభిమానమే గొప్పదని భావించి.. పదవిని గడ్డిపోచలాగా విసిరేసి.. ఈటల బయటకు వచ్చారు. ఈటలకు అండగా భారతీయ జనతాపార్టీ కార్యకర్తల బలం ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సొంత నియోజకవర్గంలోని భాగం హుజురాబాద్. ఇక్కడ ఈటల విజయం ఖాయం. బీజేపీ దిశ, దశను మార్చే ఎన్నిక ఇది. కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఒక్కో అభ్యర్థిలాగా పనిచేయాలి. ఇన్‌చార్జ్‌‌లంతా పోలింగ్ డబ్బాకు సీలు వేసేదాకా ఇక్కడే ఉండాలి. నాగార్జున సాగర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన కుట్రలు.. ఇక్కడ జరగకుండా తిప్పికొట్టాలి. పోలింగ్ బూత్‌ల వారీగా మన బలాలు, బలహీనతలు బేరీజు వేసుకుంటూ పనిచేయాలి. సోషల్ మీడియాను మనం సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలి. మనకంటే వాళ్లకే మీడియా అండ ఎక్కువగా ఉంది. అయినా మనం నమ్మకంతో పనిచేయాలి’ అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.