
- గోషామహల్ కు ఉప ఎన్నిక రాదు
- హైకమాండ్ ఆదేశిస్తే పార్టీలో చేరుతా
- తెలంగాణ బీజేపీలో కొన్ని దుష్టశక్తులున్నయ్
- నా రాజీనామా ఆమోదం వెనుక కొందరి కుట్ర
- నాకు అమిత్ షా ఫోన్ చేశాడనే వార్తల్లో నిజం లేదు
- 11 ఏండ్లు భరించిన.. ఇంకా ఎన్నేళ్లని రిజైన్ చేసిన
- నాకే కాదు బీజేపీలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలకు కనీస మర్యాద లేదు
- గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్: బీజేపీ తన ఇల్లని, వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తెలంగాణ బీజేపీలో కొన్ని దుష్టశక్తులున్నాయని, తన రాజీనామా ఆమోదం వెనుక వాళ్ల కుట్రలు పనిచేశాయని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీలో కొన్ని తప్పులు జరుగుతున్నాయని చెప్పారు. తన రాజీనామాపై హైకమాండ్ విచారణ చేస్తుందని భావించానని, అది జరగలేదని అన్నారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయంపై అమిత్ షాకు బేగంపేట విమానాశ్రయంలో చెప్పానని అన్నారు. ఆ తర్వాత పరిణామాలతోనే తాను రాజీనామా చేసినట్టు వెల్లడించారు.
పదకొండేండ్లుగా తనని ఇబ్బంది పెట్టినా భరించానని, ఇంకా ఎన్నేండ్లు భరించాలని భావించే రాజీనామా చేసినట్టు చెప్పారు. బీజేపీలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు కనీస మర్యాద దక్కడం లేదని అన్నారు. అవమానాలు తట్టుకోలేకే పలువురు నేతలు బీజేపీని వీడారని అన్నారు. పార్టీలోకి తిరిగి రావాలని హైకమాండ్ ఆదేశిస్తే మళ్లీ జాయిన్ అవుతానని చెప్పారు. తాను వేరే పార్టీలోకి వెళ్లే ప్రశ్నే లేదని కుండబద్దలు కొట్టారు. తాను హిందుత్వ అజెండాతో పనిచేసే వాడినని అన్నారు. తన వల్ల పార్టీకి ఎప్పుడూ నష్టం జరగలేదని, మహారాష్ట్ర, కర్ణాటక లో బీజేపీ తరఫున ప్రచారం చేసినట్టు తెలిపారు.
తను రాజీనామా చేసిన తర్వాత పలువురు రాష్ట్ర నాయకులు ఫోన్ చేశారని, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వంటి నేతలు తన కోసం మాట్లాడారని చెప్పారు. బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ఫైటర్ లా పార్టీని ముందకు నడిపిస్తున్నారని అన్నారు. ఆయన వెనుక కూడా కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. 200% కేంద్ర పెద్దలు తనను పార్టీలోకి ఆహ్వానిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇక్కడి విషయాలన్నీ హైకమాండ్ కు చెప్పిన తర్వాతే పార్టీలో చేరుతానని అన్నారు.