- ఎదుర్కోలు మహోత్సవంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం సందర్భంగా.. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలను టీటీడీ అధికారులు మంగళవారం యాదగిరిగుట్ట ఆలయానికి సమర్పించారు. టీటీడీ ఏఈవో రత్నం ఆధ్వర్యంలో ఆలయ ఈవో భవానీ శంకర్ చేతుల మీదుగా పట్టువస్త్రాలను ఆలయానికి సమర్పించారు. మొదట ఆలయానికి వచ్చిన టీటీడీ బృందానికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం కల్పించారు.
రాత్రి నిర్వహించిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఎదుర్కోలు మహోత్సవంలో హైకోర్టు జడ్జి జస్టిస్ నందికొండ నర్సింగరావు, యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీవో కృష్ణారెడ్డి, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణీ భరత్ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పు రాజగోపురం ఎదుట స్వామిఅమ్మవార్లను ఎదురెదురుగా అధిష్టింపజేసి ఎదుర్కోలు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
