బడుల్లో టాయిలెట్ల నిర్మాణానికి నిధులివ్వండి : ఎమ్మెల్సీ అంజిరెడ్డి

బడుల్లో టాయిలెట్ల నిర్మాణానికి నిధులివ్వండి : ఎమ్మెల్సీ అంజిరెడ్డి
  • కేంద్ర మంత్రి సావిత్రికి  ఎమ్మెల్సీ అంజిరెడ్డి వినతి

హైదరాబాద్, వెలుగు: స్వచ్ఛ విద్యాలయ మిషన్ కింద రాష్ట్రంలోని సర్కారు బడుల్లో టాయిలెట్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి కోరారు. ఆదివారం ఆయన హైదరాబాద్​ లో కేంద్రమంత్రి సావిత్రి ఠాకూర్​ను కలిసి వినతిపత్రం అందించారు. సరిపడ మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

టాయిలెట్స్ లేకపోవడంతో పేద విద్యార్థులు బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. దీనివల్ల వారు పాము కాట్లకు కూడా గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆడపిల్లలు మరింత అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని, ప్రతి స్కూల్ లో టాయిలెట్స్ నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి అంజిరెడ్డి విజ్ఞప్తి చేశారు.