నాపై పోటీ చేయాలని కవితకు 50 సార్లు చెప్పిన : అర్వింద్

నాపై పోటీ చేయాలని కవితకు 50 సార్లు చెప్పిన : అర్వింద్

నిజామాబాద్, హైదరాబాద్, వెలుగు: తనపై పోటీ చేయాలని ఎమ్మెల్సీ కవితకు తానే 50 సార్లు చెప్పానని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. ‘‘నాపై పోటీ చేయాలని నేనే డిమాండ్ చేస్తుంటే.. మళ్లా ఈ మూర్ఖపు మాటలు, దాడులు ఎందుకు? కొట్టికొట్టి చంపుతామని మీడియా సాక్షిగా బెదిరించిన మీరు.. నన్ను చంపడానికి గూండాలను పంపిస్తారా?” అని ప్రశ్నించారు. శుక్రవారం నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌‌ చేరుకున్న ఆయన.. బంజారాహిల్స్‌‌లోని తన ఇంటిని కిషన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. అంతకుముందు నిజామాబాద్‌‌లోనూ మాట్లాడారు. ‘‘నేను యాక్సిడెంటల్‌‌గా గెలిచానని అంటున్నారు. అలా అయితే మళ్లీ ఇందూరు నుంచే పోటీ చేస్తా.. కవిత మాట మార్చకుండా అక్కడి నుంచే పోటీ చేయాలి” అని సవాల్ చేశారు. 

నేనేమీ తప్పు మాట్లాడలేదు..

‘‘ఎమ్మెల్సీ కవితపై నేనేమీ తప్పుడు భాష మాట్లాడలేదు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు ఆమె ఫోన్ చేస్తే.. చేశానని చెప్పాలి. లేదంటే ఖండించాలి. అంతేగానీ నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏంటి?’’ అని అర్వింద్ ఫైర్ అయ్యారు. ‘‘మీ నాన్న కేసీఆర్ చెప్పిందే నేను మాట్లాడా. బీజేపీ వాళ్లు కవితను ఆహ్వానించారని  కేసీఆర్ చెప్పిండు. కాంగ్రెస్‌‌తో కవిత టచ్‌‌లో ఉన్నారని నేను చెప్పిన. ఇందులో తప్పేముంది? కాంగ్రెస్‌‌లోకి వెళ్తారా లేదా క్లారిటీ ఇవ్వాలి. హత్యా రాజకీయాలు చేయొద్దు” అని హితవు పలికారు. ‘‘చెప్పుతో నన్ను కొట్టడం కాదు.. ముందు మీ అయ్యను కొట్టు.. ఆ తర్వాత నా చెప్పుల అపాయింట్ మెంట్ అడగాలి” అని ఎద్దేవా చేశారు. తన ఇంటిపై దాడి చేసినట్లు కేసీఆర్ ఇంటిపైనా దాడి చేస్తారా అని, కేసీఆర్‌‌‌‌ను చెప్పుతో కొడతారా అని ప్రశ్నించారు. బీజేపీ నుంచి వందల కోట్ల ఆఫర్ ఎవరు ఇచ్చారనేది చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘కవిత రాజకీయ జీవితం ముగిసింది.. దిక్కు దివానం లేదు.. ఆమె ఎక్కడ నిలబడ్డా గెలిచే పరిస్థితి లేదు” అని స్పష్టం చేశారు. 

గులాబీ నేతలకు పోలీసులు అమ్ముడుపోయారు

రాష్ట్ర పోలీసులు దొంగలు, గులాబీ కండువాలకు అమ్ముడుపోయారని అర్వింద్ మండిపడ్డారు. ‘‘మహేందర్ రెడ్డి లాంటి యూజ్ లెస్ పోలీస్ బాస్ ని నేను ఇంత వరకు చూడలేదు.. అమ్ముడు పోయిన సరుకు. చేతగాని మహేందర్ రెడ్డి.. ఆయనతో ఏం కాదు.. ఇక్కడ టీఆర్‌‌‌‌ఎస్ ది కాదు తప్పు.. మహేందర్ రెడ్డి ది తప్పు’’ అని విమర్శించారు. ఆయన డీజీపీగా ఇండిపెండెంట్‌‌గా ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు.

కుల అహంకార మాటలు

2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేయని కేసీఆర్‌‌‌‌పై తొలి చీటింగ్ కేసు పెట్టాలని అర్వింద్ డిమాండ్ చేశారు. కుల అహంకారంతో కవిత మాట్లాడుతున్నారని, ఆమె రాజకీయ జీవితం ముగిసినట్లేనని చెప్పారు. తన తల్లిని బెదిరించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇంట్లో ఎవరూ లేని టైంలో దాడి చేశారన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన 178 మంది రైతుల్లో 70 మంది బీజేపీలో చేరారని, మిగతా వాళ్లు బీజేపీ వైపు ఉన్నారని, ఎన్నికల నాటికి వారు కూడా పార్టీలో చేరుతారని చెప్పారు.