- మంత్రిగా పదేండ్లు చర్యలు తీసుకోనందుకు ఆయన్ను అరెస్టు చేయాలి: ఎంపీ రఘునందన్‌రావు
- ఎన్ కన్వెన్షన్‌ను బీఆర్ఎస్ హయాంలో ఎందుకు కూల్చలేదు?
- 2014లో కూల్చాలన్న హైకోర్టు ఇప్పుడు స్టే ఇవ్వడమేమిటి?
- లంచ్ మోషన్ అని ఆగమాగంగా కేసులు వినకండని జడ్జీలకు విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు : హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల కబ్జాలకు, వాటిలో అక్రమ నిర్మాణాలకు కేటీఆరే బాధ్యుడని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్హయాంలో తను మున్సిపల్ మంత్రిగా హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల పరిరక్షణ పేరుతో కమిటీ వేసి తెప్పించుకున్న రిపోర్టు ఏమైందని ప్రశ్నించారు. పదేండ్లు ఆక్రమణలపై చర్యలు తీసుకోని ఆయన్న అరెస్టు చేయాలని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఎన్కన్వెన్షన్ కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించినా ఎందుకు కూల్చివేయలేదని, దాని వెనుక ఉన్న లాలూచి ఏంటో కేటీఆర్ చెప్పాలని డిమాండ్‌చేశారు.
శనివారం బీజేపీ స్టేట్ఆఫీసులో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలంటూ శనివారం హైకోర్టు ఇచ్చిన స్టేఆర్డర్పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2014 లో హైకోర్టు సదరు కన్వెన్షన్‌ను కూల్చాలని ఆదేశించిందని, అదే హైకోర్టు ఇప్పుడు స్టే ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. న్యాయ దేవత కళ్లకు ఉన్న గంతలను తొలగించి జడ్జిమెంట్లు ఇవ్వాలని ఎంపీ అన్నారు. శనివారం పార్టీ స్టేట్ ఆఫీస్ లో రఘనందన్ రావు మీడియాతో మాట్లాడారు.
“గౌరవ జడ్జీలకు నా వినతి. లంచ్ మోషన్ కేసులు అని ఆగమాగం వినకండి. ఒక్క బిల్డింగ్ కూలిపోతే ఏమవుతుంది. 2007, 2008లో చెరువుల కాపాడాలని ఉమ్మడి ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. చెరువులో కడితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చాలని సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. మళ్లీ జడ్జిలు స్టే ఇచ్చుడు ఏంది? పిల్లలు నాలాల్లో కొట్టుకోపోతే ఏమిచేశారు? దయచేసి హైకోర్టు జడ్జిలు కూడా హైదరాబాద్ చెరువుల పరిరక్షణకు సహకరించాలి. అవకాశం ఇస్తే నా వాదనలు వినిపిస్త” అని ఆయన విజ్ఞప్తి చేశారు. హైడ్రా కూల్చివేతల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు డ్రామాలు రక్తికట్టించేలా ఉన్నాయని, చెరువుల పరిరక్షణపై ఏ పార్టీ ఎంత చిత్తశుద్ధితో ఉన్నాయో ప్రజలు గమనిస్తున్నారన్నారు. 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో మీర్ఆలం చెరువు కబ్జాపై స్పందించారని, కబ్జాలను తొలగించి చెరువును క్లీన్ చేశారని రఘనందన్ రావు గుర్తు చేశారు. ఇప్పుడు మీర్ఆలం చెరువు పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసని, దీనిపై సీఎం దృష్టి పెట్టాలన్నారు. 2010లో ఎఫ్టీఎల్, శిఖంలో ఎవరు ఏం నిర్మించినా కూల్చివేయాలని కోర్టు చెప్పిందని, 157 జీవోను 2010 లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చి, 18 మందితో లేక్స్ ప్రొటక్షన్ కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.
కేటీఆర్ ఫస్ట్ నీ జన్వాడ ఫామ్‌హౌస్ కూల్చెయ్..
కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్న టైమ్‌లో ఆక్రమణలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని రఘునందన్ నిలదీశారు. కేటీఆర్ ఇపుడు పొంగులేటి, పట్నం వంటి నేతల పేర్లు చెబుతున్నారు.. కానీ ముందు ఆయన తన జన్వాడ ఫామ్ హౌస్‌ను కూల్చివేయాలని అన్నారు. కవిత, కేటీఆర్ ఫామ్‌హౌస్‌లను కూల్చేందుకు కాంగ్రెస్ సర్కారు ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. 2014 నుంచి నేటి వరకు ఎన్ కన్వెన్షన్ ద్వారా నాగార్జున సంపాదించిన మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేయాలని రఘునందన్ డిమాండ్ చేశారు. హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ గుర్తించాలని ఎన్జీటీ, 2,525 చెరువుల బఫర్ జోన్‌ను గుర్తించాలని హైకోర్టు చెప్పినా ఇప్పటి వరకు ఆ పని చేయలేదన్నారు. రాజ్ భవన్ రోడ్ లో నాలాలపై ఆసుపత్రి కట్టినా, భారీ భవనాలను నిర్మించినా పట్టించుకోవడం లేదన్నారు. హైడ్రాకు రాజకీయ దురుద్దేశం లేకపోతే అన్ని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ఆక్రమణలను తొలగించి కాపాడాలని ఎంపీ రఘునందన్ సవాల్ విసిరారు.