బీజేపీని ఢీకొనలేకనే పరస్పర ఒప్పందం : బండి సంజయ్

బీజేపీని ఢీకొనలేకనే పరస్పర ఒప్పందం : బండి సంజయ్

కరీంనగర్ : సీఎం కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీలు పిరికిపందలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బీజేపీని నేరుగా ఢీకొనలేకే ఆ ఇద్దరు నేతలు పరస్పర ఒప్పందంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అంతటా ఎంఐఎం పార్టీ అభ్యర్థులను ప్రకటించి సత్తా చాటుతామని ప్రగల్భాలు పలికిన ఒవైసీ.. ఇప్పుడు మాట తప్పి పిరికిపందలా పారిపోయారని దుయ్యబట్టారు. 

కేసీఆర్ మామను మళ్లీ సీఎం చేసేందుకు యూ టర్న్ తీసుకున్నారని అన్నారు. అందుకే పాతబస్తీలోని 9 స్థానాలకే పరిమితమయ్యారని ఒవైసీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓట్లు, సీట్ల కోసం వావివరసలను మార్చేసి.. కేసీఆర్ ను మామ అంటూ సంబోధిస్తున్నారని అన్నారు. శనివారం జూబ్లి నగర్ లో జరిగిన కరీంనగర్ రూరల్ మండల స్థాయి విస్త్రత సమావేశంలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు.  కరీంనగర్ లో తాను తప్పకుండా గెలుస్తాననే ధీమా వ్యక్తం చేశారు.