దళితుల మీద కేసీఆర్‌‌ది ఫేక్ లవ్

దళితుల మీద కేసీఆర్‌‌ది ఫేక్ లవ్

న్యూఢిల్లీ: బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి సీఎం కేసీఆర్ ఆందోళన చెందుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.  బీజేపీకి ఆదరణ, ప్రజల స్పందన చూసిన తర్వాతే కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. దేశ రాజధానిలోని తెలంగాణ భవన్ వద్ద ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావుతో కలసి నిర్వహించిన విలేకరులు సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఫేక్ ఐడీ కార్డులు, తప్పుడు ప్రచారాలు చేసే స్థాయికి దిగజారారని.. కోట్లాది రూపాయలు కుమ్మరించైనా ఎన్నికల్లో నెగ్గేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 

‘అంబేడ్కర్ జయంతిని గౌరవించని కేసీఆర్ దళితుల మీద ఫేక్ ప్రేమ చూపిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఫేక్.. ఆయన పథకాలు ఫేక్. కేసీఆర్‌కు తన పాలనపై నమ్మకం ఉంటే, ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోవాలి.అక్రమ పద్ధతిలో ఉపఎన్నికలో గెలవాలని చూస్తున్నారు. కోట్ల రూపాయలు కుమ్మరించి బంపర్ ఆఫర్లతో ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారు. అభివృద్ధిని మతకోణంలో చూస్తున్నారు. హిందువులు నివసించే ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్ల కూల్చివేతలకు పాల్పడుతున్నారు. పాతబస్తీలో పన్నులు కట్టకపోయినా, రోడ్లు ఇరుకుగా ఉన్నా అక్కడ కూల్చివేతలకు పాల్పడే ధైర్యం కేసీఆర్‌‌కు లేదు. ఒక వర్గానికి ఒక న్యాయం, మరొక వర్గానికి మరో న్యాయం ఉండకూడదు. పాతబస్తీ అభివృద్ధిని టీఆర్ఎస్ , ఎంఐఎం అడ్డుకుంటున్నాయి. గతంలో కాంగ్రెస్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలు ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నాయి’ అని బండి సంజయ్ ఆరోపించారు.