కేటీఆర్​కు సంస్కారం లేదు : కె. లక్ష్మణ్ 

కేటీఆర్​కు సంస్కారం లేదు : కె. లక్ష్మణ్ 
  • కేటీఆర్​కు సంస్కారం లేదు 
  • మోదీ, షా, నడ్డాపై నోటికొచ్చినట్లు మాట్లాడ్తవా?: కె. లక్ష్మణ్ 

హైదరాబాద్, వెలుగు : మంత్రి కేటీఆర్ కుసంస్కారి అని బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డాపై కనీస గౌరవం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. కేటీఆర్ తన స్థాయిని మరిచి మతి భ్రమించినట్లు, ఇష్టానుసారంగా మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో లక్ష్మణ్ మాట్లాడారు.

తెలంగాణ టూర్​లో మొన్న మోదీ, ఆ తర్వాత నడ్డా, తాజాగా అమిత్ షా బీఆర్ఎస్ సర్కార్ బండారాన్ని, కుటుంబ పాలనను, అరాచకాలను ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తుంటే.. కేటీఆర్ సహించలేకపోతున్నారని విమర్శించారు. ‘‘సీఎం కేసీఆర్ కొడుకువు అని తప్పితే నీకు ఉన్న అర్హత ఏమిటి? పారాచూట్​లా ఉద్యమంలో దూరి వారసత్వ రాజకీయాలతో ఎదిగిన నీవు.. కార్యకర్త స్థాయి నుంచి దేశ ప్రజల మెప్పుతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రధాని, కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన మోదీ, అమిత్ షాలను విమర్శిస్తావా?” అంటూ లక్ష్మణ్ మండిపడ్డారు.

బీఆర్ఎస్ సర్కారు పాలన ప్రజల జేబులో ఒక రూపాయి పెట్టి.. వెనక జేబులోంచి పది రూపాయలు కొట్టే స్తున్నట్లుగా ఉందన్నారు. పంట నష్టపోయి మంగళవారం కౌలు రైతు దంపతులు అశోక్, సంగీత ఆత్మహత్య చేసుకున్నారని.. రాష్ట్రంలో రైతుల దుస్థితి ఇలా ఉందన్నారు. ‘‘నదులకు నడక నేర్పు డు సంగతి దేవుడెరుగు కానీ.. మద్యాన్ని మాత్రం ఢిల్లీకి, పంజాబ్ కు ప్రవహింపజేసిన ఘనత మాత్రం కల్వకుంట్ల కుటుబానిదే” అంటూ ఆయన ఎద్దేవా చేశారు.  

16 తర్వాత బీజేపీ ఫస్ట్ లిస్ట్ 

అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా బీజేపీ మేనిఫెస్టో ఉంటుందని లక్ష్మణ్ చెప్పారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలోపే మేనిఫెస్టో, చార్జిషీట్ రిలీజ్​ చేస్తామన్నారు. ఈ నెల 16 తర్వాత బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టును పార్టీ నేషనల్ ఎలక్షన్ కమిటీ విడుదల చేస్తుందన్నారు. బీజేపీ అభ్యర్థుల ఎంపికలో ఆయా సామాజిక వర్గాలు, యువత, మహిళలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.