భూమి, గాలి, పాతాళం.. ఏదీ వదల్లేదు .. కేసీఆర్​ది అంతటా అవినీతే: లక్ష్మణ్

భూమి, గాలి, పాతాళం..  ఏదీ వదల్లేదు .. కేసీఆర్​ది అంతటా అవినీతే: లక్ష్మణ్
  • భూమి, గాలి, పాతాళం..  ఏదీ వదల్లేదు .. కేసీఆర్​ది అంతటా అవినీతే: లక్ష్మణ్
  • బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటే
  • బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి  
  • ఇయ్యాల మూడో జాబితాకు ఆమోదం తెలుపుతామని వెల్లడి 

న్యూఢిల్లీ, వెలుగు: కేసీఆర్ కు పదేండ్లు అధికారమిస్తే విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఆయన భూమి, గాలి, పాతాళం.. ఇలా ఏ ఒక్కటీ వదల్లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన చూసిన తెలంగాణ ప్రజలు.. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అవినీతి రహిత పాలన బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. మంగళవారం ఢిల్లీలోని తన ఇంట్లో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ బీసీ సీఎం నినాదానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని ఆయన తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తామని వెల్లడించారు. ‘‘ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎక్కడా వెనుకపడలేదు. బుధవారం పార్లమెంటరీ పార్టీ బోర్డు మీటింగ్ ఉంది. ఈ భేటీలో రాజస్థాన్, తెలంగాణ అభ్యర్థుల జాబితాకు ఆమోదం తెలిపి విడుదల చేస్తాం” అని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటే అని ఫైర్ అయ్యారు. 

జనసేనతో పొత్తుపై చర్చలు కొనసాగుతున్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తామని లక్ష్మణ్ తెలిపారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆయన వచ్చాక కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి దాడులను బీజేపీ ప్రోత్సహించదని, ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. విభేదాలు ఉంటే పరిష్కరించుకోవాలే తప్ప, భౌతిక దాడులు చేయడం సరికాదన్నారు. ‘‘మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీలోనే కొనసాగుతారు. ఆయన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు చక్కటి మేనిఫెస్టో ఇచ్చారు. ఆరు నెలలుగా వివేక్ వెంకటస్వామిపై ఇలాంటి ప్రచారం జరుగుతూనే ఉంది. దీన్ని ఆయన ఖండిస్తూనే ఉన్నారు” అని చెప్పారు.