పాపన్న స్ఫూర్తితో ముందుకెళ్లాలి..బహుజనులు సమానత్వం కోసం పోరాడాలి

పాపన్న స్ఫూర్తితో ముందుకెళ్లాలి..బహుజనులు సమానత్వం కోసం పోరాడాలి

హైదరాబాద్, వెలుగు: సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో బహుజనులు సామాజిక, ఆర్థిక, సమానత్వం కోసం పోరాడాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సబ్బండ వర్గాలకు ఆయనే స్ఫూర్తి అన్నారు. శుక్రవారం పాపన్న జయంతి సందర్భంగా బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. బహుజనుల ఆత్మగౌరవ పోరాటానికి పాపన్న స్ఫూర్తి అన్నారు. పాపన్నను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ సమాజం కేసీఆర్ దోపిడీ పాలనపై తిరుగుబాటు చేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య చెప్పారు. కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్, పార్టీ నేతలు వీరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం

బీసీ కుల వృత్తిదారుల కోసం ప్రధాని మోదీ విశ్వకర్మ స్కీమ్ అమలు చేస్తున్నందున పార్టీ ఆఫీస్​లో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆయన ఫొటోకు పాలాభిషేకం చేశారు. సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి వేడుకలు ఉన్నందున మోదీ ప్రవేశపెట్టిన ఈ స్కీమ్​పై గ్రామాల్లో అవగాహన కల్పించాలని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కోరారు. 

లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశమైన ఉద్యమ కమిటీ

బీజేపీ ఎంపీ, ఆ పార్టీ ఉద్యమ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ అధ్యక్షతన పార్టీ స్టేట్ ఆఫీస్​లో కమిటీ సమావేశమైంది. ఈటల రాజేందర్, కమిటీ సభ్యులు మనోహర్ రెడ్డి, తుల ఉమ, కుమార్, అశ్వత్థామ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. గురు, శుక్రవారాల్లో మండల, డివిజన్ స్థాయిల్లో పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 23, 24 , 25వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ఎమ్మెల్యేలు, మంత్రుల ఘెరావ్ ఆందోళనలను విజయవంతం చేయడంపై చర్చించారు.