
హనుమకొండ, వెలుగు: సీఎం కేసీఆర్ హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేస్తున్న పోరాటాలకు సీఎం కేసీఆర్ వణుకుతున్నాడని, పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమాలను అణచివేస్తున్నాడని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, పార్టీ పార్లమెంట్ బోర్డు మెంబర్ డా.కె.లక్ష్మణ్ మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన ఆందోళనల్లో పాల్గొని గాయపడిన పలువురు నేతలను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డితో కలిసి గురువారం ఆయన పరామర్శించారు.
అనంతరం ప్రెస్మీట్లో మాట్లాడారు.. - హామీలు ఇచ్చి మోసం చేస్తున్న కేసీఆర్ ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు దక్కేవరకు బీజేపీ పోరాడుతుందని, అందులో భాగంగానే సెప్టెంబర్ 7న మిలియన్ మార్చ్ మాదిరిగా ‘చలో హైదరాబాద్’ నిర్వహించి ప్రభుత్వ కార్యకలాపాలను దిగ్బంధిస్తామని చెప్పారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, నిరసనలు ఉంటాయన్నారు.