
శాసనసభ సమావేశాలను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ప్రధాని మోడీని, కేంద్రాన్ని టార్గెట్ చేసి.. శాసనసభ వేదికగా విమర్శలు చేశారని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు వేరు కాదన్న ఆయన.. కాంగ్రెస్ రాసిచ్చిన స్ర్కిప్టే తండ్రీ, కొడుకులు చదివారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ది చేయాలి.. ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే దానిపై చర్చించకుండా.. బీజేపీని విమర్శించడానికే సమయాన్ని వృధా చేశారని మండిపడ్డారు. తమ వైఫల్యాలు బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారని అన్నారు. అసలు సెక్రటేరియట్‌కు రాని ముఖ్యమంత్రికి సెక్రటేరియట్ అవసరమా అని నిలదీశారు. గతంలో కేంద్రమంత్రిగా కేసీఆర్ ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని లక్ష్మణ్ ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై చర్చించే ధైర్యం కేసీఆర్‌కు లేదన్నారు. కరోనా సమయంలో పొరుగుదేశాలు ఆర్థికంగా చితికిపోతే.. భారత్‌లో ప్రధాని మోడీ ఆర్థిక సంక్షోభం లేకుండా చేశారని ఎంపీ లక్ష్మణ్ గుర్తు చేశారు.