శివమొగ్గ : ప్రతీ హిందువు ఇంట్లో పదునైన కత్తులు ఉంచుకోవాలంటూ బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఇటీవల హత్యకు గురైన హిందువుల గురించి ఆదివారం జరిగిన సౌత్ రీజియన్ వార్షిక సదస్సులో ఆమె ప్రస్తావించారు. తమపై దాడి జరిగితే స్పందించే హక్కు ప్రతీ హిందువుకు ఉందన్నారు. అది తమ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని చెప్పారు. ‘‘లవ్ పేరుతో కొందరు జిహాద్ చేస్తున్నారు. అందులో ప్రేమ మాత్రం ఉండదు. ఇలా చేసేవారంతా తమ దేవుళ్లను పూజిస్తారు. మనం మన దేవుళ్లను ప్రేమించాలి”అని ప్రగ్యాసింగ్ అన్నారు. దేవుడు సృష్టించిన లోకంలో పాపాత్ములున్నారని, వీరిని అంతం చేయాలని, లేదంటే ప్రేమకు సరైన అర్థం చెప్పలేమన్నారు.
‘‘ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలీదు. అందుకే ప్రతీ హిందువు ఇంట్లో ఆయుధాలు పెట్టుకోవాలి. లేదంటే కూరగాయల కోసం ఉపయోగించే పదునైన కత్తులైనా రెడీగా ఉంచుకోవాలి. మనపై ఎవరైనా దాడి చేయడానికొస్తే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఇవి ఉపయోగపడ్తాయి.”అని ప్రగ్యా సింగ్ చెప్పారు. తమ పిల్లలను మిషనరీ స్కూల్స్‌లో చదివించొద్దని సూచించారు. వాళ్లు పెద్దయ్యాక స్వార్థపరులుగా మారి పేరెంట్స్‌ను ఓల్డేజ్ హోమ్స్‌కు పంపిస్తారని హెచ్చరించారు. పిల్లలతో ఇంట్లో పూజలు చేయించాలని, తమ సంప్రదాయాల గురించి నేర్పించాలన్నారు.
