- భూగర్భ జలాలను కలుషితం చేసిందని తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి ఆరోపణ
- సరైన వివరణ ఇవ్వకుంటే మూసేస్తామని వార్నింగ్
- ఐఫోన్ విడిభాగాల తయారీ ఇక్కడే
బెంగళూరు: యాపిల్ ఐఫోన్ల కోసం విడిభాగాలను తయారు చేసే టాటా ఎలక్ట్రానిక్స్ హోసూర్ ఫ్యాక్టరీని మూసేస్తామని తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి (టీఎన్‌పీసీబీ) హెచ్చరించింది. ఈ ప్లాంట్ నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాలు సమీపంలోని వ్యవసాయ భూముల భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై త్వరలో సరైన వివరణ ఇవ్వాలని, లేకుంటే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరిస్తూ ఈ ఏడాది మే 25న మూడు పేజీల షోకాజ్ నోటీసు జారీ చేసింది.
సమస్య ఏంటంటే?
తమిళనాడులోని హోసూర్‌లో ఉన్న ఈ టాటా ప్లాంట్ ఐఫోన్ల బ్యాక్ ప్యానెల్స్, ఇతర విడిభాగాలను తయారు చేస్తోంది. ఫ్యాక్టరీ నుంచి వస్తున్న రసాయన వ్యర్థ జలాల వల్ల తమ ఓపెన్ బావులు, సాగుభూములు కలుషితమవుతున్నాయని స్థానిక రైతులు గత కొన్ని నెలలుగా ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై స్పందించిన అధికారులు డిసెంబర్ 2025 నుంచి మే 2026 మధ్య ఐదుసార్లు తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో, టాటా సంస్థ తన ఫ్యాక్టరీ లోపల ఉన్న వర్షపు నీటి నిల్వ కుంటలోకి వ్యర్థ జలాలను వదిలిందని, అది పొంగిపొర్లి పక్కనే ఉన్న వ్యవసాయ భూముల్లోని బావుల్లోకి చేరి భూగర్భ జలాలను కలుషితం చేసిందని కాలుష్య నియంత్రణ మండలి తేల్చింది. డిసెంబర్ 2025 లోనే దీనిపై ఆదేశాలు జారీ చేసినప్పటికీ, టాటా యాజమాన్యం ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని నోటీసులో పేర్కొన్నారు.
నిబంధనలకు కట్టుబడే పనిచేస్తున్నాం: టాటా
ఈ ఆరోపణలపై టాటా ఎలక్ట్రానిక్స్ స్పందిస్తూ.. తాము ఒక గుర్తింపు పొందిన స్వతంత్ర లాబొరేటరీ ద్వారా ల్యాబ్ పరీక్షలు నిర్వహించామని, తమ ఫ్యాక్టరీ అన్ని పర్యావరణ నిబంధనలకు కట్టుబడే పనిచేస్తోందని స్పష్టం చేసింది. స్థానిక పర్యావరణ పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని, కాలుష్య నియంత్రణ మండలికి ఇప్పటికే వివరణ ఇచ్చామని తెలిపింది. ఈ విషయమై యాపిల్ సంస్థ గానీ, తమిళనాడు ప్రభుత్వం గానీ ఇంకా స్పందించలేదు.
చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి యాపిల్ భారతదేశంలో ఐఫోన్ల ఉత్పత్తిని భారీగా పెంచుతోంది. తైవాన్ ఫాక్స్‌కాన్ తర్వాత దక్షిణ ఆసియాలో ఈ కంపెనీకి టాటా సంస్థ రెండో అతిపెద్ద సరఫరాదారుగా మారింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం, 2026 నాటికి ప్రపంచవ్యాప్త ఐఫోన్లలో 26శాతం భారత్‌లోనే తయారయ్యాయని అంచనా.
అయితే, ఈ హోసూర్ ప్లాంట్‌లో సెప్టెంబర్ 2024 లో జరిగిన అగ్నిప్రమాదం, పెగాట్రాన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం, ఫాక్స్‌కాన్‌పై వచ్చిన వివాదాల తర్వాత తాజా కాలుష్య నోటీసులు యాపిల్ ఇండియా సప్లయ్ చెయిన్‌కు కొత్త సవాలుగా మారాయి.
