టీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది

టీఆర్ఎస్ ప్రజలను  తప్పుదోవ పట్టిస్తోంది

రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలంటే రామరాజ్యం రావాలని అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని తెలుసుకునేందుకే జాతీయ నేతలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించారని చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఆ తర్వాత ప్రజలను పట్టించుకున్నది లేదని విమర్శించారు. ఇంటికొక ఉద్యోగం, ఉచిత ఎరువులు, లక్ష రుణమాఫీ,12శాతం గిరిజన రిజర్వేషన్లు వంటి ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. సింగరేణి కార్మికులను ఆదుకుంటామని చెప్పి మోసం చేశారని విమర్శించారు.

పోడు వ్యవసాయం చేసుకుంటున్నవారికి పట్టాలు ఇస్తామని చెప్పి..వారిని నట్టేట ముంచారని బాపూరావు అన్నారు. ప్రజలందరూ టీఆర్ఎస్ మోసాలను గమనించాలన్న ఆయన.. ప్రజలను టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే కేసీఆర్ మాత్రం అవి రాష్ట్ర నిధులంటూ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర నిధులతోనే గ్రామాల్లో సీసీ రోడ్లు వేశారని తెలిపారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని విమర్శించారు.