భర్తల ప్రాణాల కోసం పోరాడాల్సింది.. మీకు స్ఫూర్తి లేదు: పహల్గాం బాధిత మహిళలపై బీజేపీ MP వివాదస్పద వ్యాఖ్యలు

భర్తల ప్రాణాల కోసం పోరాడాల్సింది.. మీకు స్ఫూర్తి లేదు: పహల్గాం బాధిత మహిళలపై బీజేపీ MP వివాదస్పద వ్యాఖ్యలు

చంఢీఘర్: కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ బీజేపీ నేత, మంత్రి కున్వర్ విజయ్ షా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. కల్నల్ సోఫియాను ఉగ్రవాదుల సోదరి అంటూ ఆయన చేసిన కామెంట్స్‎పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా.. సదరు మంత్రిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఫైర్ అయ్యింది. ఇదిలా ఉండగానే.. పహల్గాం ఉగ్రదాడిలో భర్తల ప్రాణాలు కోల్పోయిన మహిళలపై బీజేపీ సీనియర్ నేత, రాజ్య సభ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

 అహల్యాబాయి హోల్కర్ జయంతి సందర్భంగా భివానీలో జరిగిన వేడుకలకు జాంగ్రా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళలు తమ భర్తల ప్రాణాల కోసం ఉగ్రవాదులను వేడుకునే బదులు వాళ్లకు వ్యతిరేకంగా పోరాడి ఉండాల్సిందన్నారు. పహల్గామ్‌ దాడి బాధిత మహిళలకు యోధుల స్ఫూర్తి లేదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 

‘‘పహల్గాం ఉగ్రదాడి బాధిత మహిళలు తమ భర్తల ప్రాణాల కోసం ఉగ్రవాదులను వేడుకునే బదులు.. వారికి వ్యతిరేకంగా పోరాడాల్సింది. దీనివల్ల ప్రాణనష్టం తక్కువగా ఉండేది. పర్యాటకులందరూ అగ్నివీరులైతే వారు ఉగ్రవాదులను ఎదుర్కొని చివరికి ప్రాణనష్టాన్ని తగ్గించేవారు. రాణి అహల్యాబాయి ధైర్య స్ఫూర్తిని మన సోదరీమణుల్లో తిరిగి రగిలించాలి’’  జాంగ్రా వ్యాఖ్యానించారు. 

ఎంపీ రామ్ చందర్ జాంగ్రా వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. భారత దేశ సైనికులను, మహిళలను అవమానించడం బీజేపే నేతలకు అలవాటు అయిపోయిందని ఫైర్ అవుతున్నారు.  ఎంపీ జాంగ్రా వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ జైరాం రమేష్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద బాధితుల పట్ల ఆయన ప్రకటన సిగ్గుచేటన్నారు. బీజేపీ నాయకులు భారత సైన్యాన్ని, అమరవీరులైన సైనికులను పదే పదే అవమానిస్తున్నారని.. ఇది వారి అవమానకరమైన మనస్తత్వానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. అధికారం మత్తులో ఉన్న బీజేపీ చాలా సున్నితంగా మారిందని విమర్శించారు. 

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో భద్రతా లోపంపై చర్యలు తీసుకుండా.. పై నుంచి అమరవీరులను, వారి వితంతువుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలు విజయ్ షా, దేవ్డా వంటి నాయకులపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అసహనం వ్యక్తం చే శారు. ప్రధాని మోడీ, బీజేపీ హైకమాండ్ ఆ పార్టీ నేతల వ్యాఖ్యలపై మౌనంగా ఉన్నారంటే.. వాళ్లు ఈ వ్యాఖ్యలను సమర్ధించినట్లేనా అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ జంగ్రా వ్యాఖ్యలకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలని.. అతడిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. 

యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ఎంపీ జంగ్రా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గామ్ బాధిత మహిళల గురించి బీజేపీ ఎంపీ చేసిన అసహ్యకరమైన ప్రకటనకు ఖండించదగినది అనే పదం కూడా సరిపోదని విమర్శించారు. బీజేపీ మహిళలను గౌరవించడానికి బదులు.. వారిని అవమానించడం, నిందించడం, వేధించడం చేస్తోందని.. -ఇదే వారి నిజస్వరూపమని అన్నారు. బీజేపీ ఒక రాజకీయ పార్టీ కాదని, అది మహిళా వ్యతిరేక మనస్తత్వం కలిగిన మురికి కూపమని దుయ్యబట్టారు.