- రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 క్రిటికల్ కేర్ బ్లాక్స్ ఏర్పాటుపై సర్కారు ఫోకస్
- హైవేలపై 109 ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకూ నిర్ణయం
- జిల్లాల్లో ప్రజలకు చేరువ కానున్న గోల్డెన్ అవర్ ట్రీట్‌మెంట్
- ఐసీయూ, డయాలసిస్, ఆపరేషన్ థియేటర్లతో కార్పొరేట్ స్థాయి వైద్యం
హైదరాబాద్, వెలుగు: ఎమర్జెన్సీ సమయాల్లో అత్యవసర వైద్య సేవలను అందించడం ద్వారా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ సెంటర్లను ఏర్పాట్లు చేస్తున్నది. ప్రమాదాలు జరిగినా, హార్ట్ స్ట్రోక్ వచ్చినా, విష జ్వరాలు ప్రబలినా.. ఇకపై హైదరాబాద్ కు పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నది. ప్రజలకు తమ సొంత జిల్లాల్లోనే కార్పొరేట్ స్థాయి ఎమర్జెన్సీ వైద్యం అందించేందుకు క్రిటికల్ కేర్ బ్లాక్(సీసీబీ)లను విడతల వారీగా అందుబాటులోకి తీసుకువస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 31 సీసీబీలను ఏర్పాటు చేస్తుండగా, ఇప్పటికే సంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్ లో క్రిటికల్ కేర్ బ్లాకులు అందుబాటులోకి వచ్చాయి.
తాజాగా మరో 9 సీసీబీలను వారం పది రోజుల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. వనపర్తి, కామారెడ్డి, జగిత్యాల, జనగామ, వికారాబాద్, గోదావరిఖని, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో సీసీబీలను ప్రారంభించేందుకు హెల్త్ డిపార్ట్మెంట్ ఇప్పటికే సర్వం సిద్ధం చేసింది. సీసీబీలలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్ ను ప్రారంభ సమయంలోపే సమకూర్చుకోవాలని అధికారులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించారు.
50 బెడ్లు.. అత్యాధునిక వసతులు
జిల్లాల్లోని మెడికల్ కాలేజీలు, జిల్లా హాస్పిటల్స్ ప్రాంగణంలో 50 బెడ్ల సామర్థ్యంతో అత్యాధునిక వసతులతో సీసీబీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన హాస్పిటల్స్ పై భారం పడకుండా స్వయం ప్రతిపత్తితో నడిచేలా వీటిని డిజైన్ చేశారు. సీసీబీలలోని మొత్తం 50 బెడ్లలో10 ఐసీయూ, 6 హై డిపెండెన్సీ యూనిట్ బెడ్లు, 4 ఎమర్జెన్సీ బెడ్లు ఉండనున్నాయి. ఇక అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఇన్స్ఫెక్షన్ ఇతరులకు సోకకుండా ఉండేందకు ప్రత్యేకంగా 24 ఐసోలేషన్ బెడ్లు, 2 స్పెషల్ ఐసోలేషన్ రూములను సీసీబీలలో ఏర్పాటు చేశారు.
నెగెటివ్ ప్రెషర్ వెంటిలేషన్ సిస్టమ్ తో పాటు పేషంట్లు వచ్చేందుకు సెపరేట్ ఎంట్రీ ఉంటుంది. ఆపరేషన్ల కోసం 2 అడ్వాన్స్ డ్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, క్లిష్టమైన డెలివరీల కోసం 2 ఎల్డీఆర్ (లేబర్, డెలివరీ, రికవరీ) రూమ్స్ ఉన్నాయి. కిడ్నీ పేషెంట్ల కోసం సపోర్టివ్ సిస్టమ్ కూడా సీసీబీలో ఏర్పాటు చేశారు. 2 డయాలసిస్ బెడ్లు, సొంతంగా డయాగ్నస్టిక్ ల్యాబ్, ఆక్సిజన్ సప్లై ప్లాంట్ కూడా సిద్ధం చేశారు.
రూ.769 కోట్లతో.. 31 సీసీబీలు
ప్రజలకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఎమర్జెన్సీ సేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 31 సీసీబీలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే మూడు చోట్ల ఇవి అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మరో 9 జిల్లాల్లో ప్రారంభించనున్నారు. 29 సీసీబీలు 50 బెడ్ల కెపాసిటీతో, మరో రెండు సీసీబీలు100 బెడ్ల కెపాసిటీతో ఏర్పాటు కానున్నాయి. 50 బెడ్ల సీసీబీలకు రూ. 23.75 కోట్లు, 100 బెడ్ల సీసీబీలకు 40.5 కోట్లు వెచ్చిస్తున్నారు. 100 బెడ్ల సీసీబీలు హైదరాబాద్ లోని ఫీవర్ హాస్పిటల్, రంగారెడ్డి జిల్లా కొండాపూర్ లో ఏర్పాటు చేయనున్నారు.
వచ్చే మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 31 సీసీబీలను అందుబాటులోకి తేవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. కాగా, సీసీబీలలో రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాల్లో గాయపడిన వారికి వెంటనే సర్జరీలు నిర్వహించేందుకు ఆర్థోపెడిక్, న్యూరో, ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ ఫిజీషియన్లు 24 గంటలూ అందుబాటులో ఉండనున్నారు. జిల్లాల్లో టీవీవీపీ, డీఎంఈ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే ట్రామా కేర్ సెంటర్లకు ఇవి అదనంగా పని చేయనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సీసీబీలు అందుబాటులోకి వస్తే జిల్లాల నుంచి గాంధీ, ఉస్మానియా, నిమ్స్ కు వచ్చే రిఫరల్ కేసుల భారం తగ్గే అవకాశాలు ఉన్నాయి.
హైవేలపై.. ట్రామా కేర్ సెంటర్లు
సీసీబీలతోపాటు రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా109 ట్రామాకేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే వైద్యం అందించేలా రాష్ట్ర హైవేల వెంట ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ అందుబాటులో ఉండేలా ప్లాన్ చేశారు. వరల్డ్ బ్యాంక్ నిధులు రాగానే వాటిని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 74, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో మరో 35 కలిపి మొత్తం 109 ట్రామా కేర్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ట్రామా కేర్ నెట్వవర్క్ కు నోడల్ సెంటర్ గా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ వ్యవహరించనుంది.
10 నిమిషాల్లో హాస్పిటల్‌కు చేర్చేలా నెట్‌వర్క్
అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లకు కొన్ని నిమిషాల వ్యవధిలోనే చికిత్స అందించి, వారి ప్రాణాలు నిలబెట్టే లక్ష్యంతో ఎమర్జెన్సీ వైద్య వ్యవస్థను రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగానే రాష్ట్ర, జాతీయ రహదారులపై మూడంచెల ట్రామా కేర్ వ్యవస్థ ఏర్పాటును ప్రారంభించాం. రాష్ట్రవ్యాప్తంగా వందకుపైగా ట్రామా కేర్ సెంటర్లు, క్రిటికల్ కేర్ బ్లాక్స్ ను అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో పది నిమిషాల వ్యవధిలోనే పేషెంట్ ను హాస్పిటల్‌కు చేర్చే విధంగా108 అంబులెన్స్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నాం.
- దామోదర రాజనర్సింహా, హెల్త్ మినిస్టర్
