మెదక్ జిల్లాలో ముగిసిన పల్లె పోరు

మెదక్ జిల్లాలో ముగిసిన పల్లె పోరు
  • ప్రశాంతంగా మూడో విడత
  • పోలింగ్​ తీరును పరిశీలించిన కలెక్టర్లు
  • మెదక్ ​జిల్లాలో 90.68 శాతం పోలింగ్

మెదక్, వెలుగు: మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్​ బుధవారం మెదక్​ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది.  కొల్చారం, కౌడిపల్లి, చిలప్​ చెడ్​, నర్సాపూర్​, శివ్వంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల పరిధిలోని పంచాయతీల్లో పోలింగ్​నిర్వహించారు. ఉదయం 7 నుంచే ఓటర్లు పోలింగ్​ కేంద్రాలకు తరలివచ్చి ఓటేశారు. జిల్లాలో మొత్తం 90.68 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా నర్సాపూర్​ మండలంలో 93.38 శాతం ఓట్లు పోలయ్యాయి. తర్వాత 92.57 శాతం పోలింగ్​తో  శివ్వంపేట మండలం రెండో స్థానంలో నిలిచింది. 

ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి శివ్వంపేట మండలం గోమారంలో, మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్​ రెడ్డి సొంతూరు కౌడిపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కలెక్టర్​ రాహుల్​ రాజ్​ కౌడిపల్లిలోని పోలింగ్​ కేంద్రాన్ని, కొల్చారం మండలం అప్పాజిపల్లి పోలింగ్​ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్​ తీరును పరిశీలించారు. ఎస్పీ డీవీ శ్రీనివాస్​ రావు, ఏఎస్పీ మహేందర్ వివిధ మండలాల్లో పర్యటించి పోలింగ్​ ప్రక్రియను పర్యవేక్షించారు.​ 

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట: జిల్లాలోని హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ, మద్దూరు, ధూల్మిట్ట, సిద్దిపేట డివిజన్ లో కొమురవెల్లి, చేర్యాల, గజ్వేల్ డివిజన్ లోని కొండపాక, కుకునూరుపల్లి మండలాల పరిధిలోని 163 పంచాయతీలు, 1432 వార్డులున్నాయి. వీటిలో 13 పంచాయతీలు, 249 వార్డులు ఏకగ్రీవమవడంతో మొత్తం 150 పంచాయతీలు, 1183 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. 9 మండలాల పరిధిలో  2,13,327 ఓట్లలో 1,84,253  మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా 88.45  శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం పోలైన ఓట్ల లో పురుషులు 91,492, మహిళలు 92,759  మంది ఓటు హక్కును వినియోగించకోగా పురుషుల కంటే మహిళలు 1267  మంది అధికంగా ఓట్లు వేశారు.

కుకునూరుపల్లి  మండలంలో అత్యధికంగా 91.08  శాతం, అత్యల్పంగా చేర్యాల మండలంలో   86.87 శాతం మేర పోలింగ్‌‌ నమోదైంది. కలెక్టర్‌‌ హైమావతి  కోహెడ, కొండపాక మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను, సీపీ విజయకుమార్ కొండపాక, చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో పోలింగ్‌‌ తీరును పరిశీలించారు. కోహెడ మండలం గుండారెడ్డి పల్లిలో  పోలింగ్ కేంద్రం సమీపంలో ఉన్న సర్పంచ్ అభ్యర్థితో పాటు అతడి అనుచరులను పోలీసులు వెనక్కి నెట్టారు. దీంతో కొద్ది సేపు వారి మధ్య గొడవ జరిగింది. 

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి/నారాయణఖేడ్/న్యాల్కల్: జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 87.43 శాతం పోలింగ్ నమోదైంది. నారాయణఖేడ్, జహీరాబాద్ డివిజన్ల పరిధిలో 8 మండలాల్లో మొత్తం 234 పంచాయతీలు, 1,960 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 27 పంచాయతీలు, 422 వార్డులు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగతా 207 పంచాయతీలు, 1,536 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కల్హేర్ మండలంలో 88.06 శాతం, కంగ్టిలో 86.17, మనూర్ లో 89.35, నాగల్ గిద్దలో 87.83, నారాయణఖేడ్ లో 87.57, నిజాంపేట్ లో 88.92,  సిర్గాపూర్ లో 88.04, న్యాల్కల్ మండలంలో 85.99 శాతం పోలింగ్ నమోదైంది.

కలెక్టర్ ప్రావీణ్య, సబ్ కలెక్టర్  కలిసి పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. న్యాల్కల్ మండలం మెటల్ కుంట పంచాయతీ పోలింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ టైం ముగిసినప్పటికీ ఓటు వేసేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ లీడర్లు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి పంచాయతీ పోలింగ్ కేంద్రానికి హైదరాబాద్ నుంచి వచ్చిన యాస్మిన్ ఓటు చోరీకి గురైంది. దీంతో దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.