
- రాష్ట్ర సర్కారు తీరుపై భగ్గుమన్న బీజేపీ
- బండి సంజయ్ అరెస్టును ఖండించిన నేతలు
- నేడు బూత్ స్థాయిలో ప్రతిజ్ఞ
- బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ నేడు బూత్ స్థాయిలో బీజేపీ శ్రేణుల ప్రతిజ్ఞ
హైదరాబాద్, వెలుగు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ అహంకారానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ ఢిల్లీ నుంచి బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంజయ్ అరెస్టును నిరసిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలందరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.
సంజయ్ అరెస్టు ను నిరసిస్తూ బీజేపీ స్టేట్ ఆఫీసు ముందు పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంకో వైపు సంజయ్ అరెస్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డీజీపీ అంజనీ కుమర్ కు ఫోన్ చేసి ఆరా తీశారు. ఎందుకు అరెస్టు చేశారని అడగ్గా .. తెలుసుకొని చెబుతానని డీజీపీ అనడంతో కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
లోక్‌సభ స్పీకర్‌కు సంజయ్ ఫిర్యాదు
తన అరెస్టుపై సంజయ్ లోక్ సభ స్పీకర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొర బడి అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు.
పాలన చేతగాక అక్రమ అరెస్టు: బీఎల్ సంతో ష్
అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్కు పాలన చేతగాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అక్రమంగా అరె స్టు చేసిందని బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని, రాజకీయంగా ఆ పార్టీ సమాధి అయ్యే రోజులు దగ్గరపడ్డాయన్నారు.
కేసీఆర్.. ఖబడ్దార్: వివేక్ వెంకటస్వామి
పేపర్ లీకులతో, లిక్కర్ దందాలతో నిండా అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ పాలనను ప్రశ్నించినందుకు తమ పార్టీ అధ్యక్షుడు సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘‘కేసీఆర్.. ఖబడ్దార్. నీ రాక్షస పాలనకు రోజులు దగ్గర పడ్డయ్. పోలీసులను అడ్డుపెట్టుకొని ఎంతో కాలం రాష్ట్రాన్ని పాలించలేవు. మరో ఆరు నెలల్లో తెలంగాణ ప్రజలు నీ పాలనపై అసలైన తీర్పు ఇస్తారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు బీజేపీనే ఆదరిస్తారు” అని పేర్కొన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఆపలేవని కేసీఆర్‌కు హెచ్చరించారు.
అరెస్ట్‌ను ఖండిస్తున్నం : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, అర్ధరాత్రి బండి సంజయ్‌ని అరెస్టు చేయడం ఏంటని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిలదీశారు. బుధ వారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన పార్టీ నేతలు విఠల్, ప్రకాష్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఐపీసీ నడవడం లేదని, కేసీఆర్ పీనల్ కోడ్ ( కేపీసీ ) నడుస్తున్నదని మండిపడ్డారు. ‘‘కేసీఆర్ ను ఎమ్మెస్సీ పొలిటికల్ సైన్స్ డిగ్రీ అడిగినందుకు అరెస్టు చేశారా?” అని దుయ్యబట్టారు.
ప్రశ్నిస్తే అరెస్టులా?: రాజాసింగ్
‘‘బీఆర్ఎస్ సర్కార్ ను, సీఎం కేసీఆర్ ను, ఆయన కొడుకు కేటీఆర్ ను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అరెస్టు చేసి జైల్లో పెట్టినంత మాత్రాన సంజయ్ భయపడరు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం ఆపేది లేదు’’ అని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
కుట్రలకు బీజేపీ భయపడదు: ప్రేమేందర్ రెడ్డి
‘‘టీఎస్పీఎస్సీ, టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీతో బీఆర్ఎస్ ప్రతిష్ట మసకబా రుతున్నదని గుర్తించే రాష్ట్ర సర్కారు.. అసలు సమస్య ను పక్కదారి పట్టించేందుకు సంజయ్‌ను అరెస్ట్ చే సింది” అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ అహంకారానికి నిదర్శనం: తరుణ్ చుగ్
బీఆర్ఎస్ ప్రభుత్వం పతనం దిశగా పయనిస్తూ నిస్సహాయ స్థితిలో ఉందని, అందుకే బీజేపీని టార్గెట్ చేసి సంజయ్‌ను అరెస్టు చేసిందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. సంజయ్ అరెస్టుపై ఆయన రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. మోడీ రాష్ట్ర పర్యటనకు భయపడే కేసీఆర్ సంజయ్‌ను అరెస్టు చేయించారన్నారు. కేసీఆర్ అహంకారానికి ఇది నిదర్శనమని దుయ్యబట్టారు. కేసీఆర్ సర్కార్ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతూ నియంత ధోరణితో బండి సంజయ్ తో పాటు పార్టీ నేతలను అరెస్టు చేస్తున్నదన్నారు.
రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం: పొంగులేటి సుధాకర్‌రెడ్డి
బండి సంజయ్‌ను అరెస్టు చేసే సమయంలో ఎంపీగా ఆయనకున్న ఎలాంటి హక్కులను కూడా పోలీసులు గౌరవించలేదని, నిబంధనలకు పూర్తి విరుద్ధంగా అర్ధరాత్రి అరెస్టు చేశారని బీజేపీ తమిళనాడు కో ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతున్నదని ఫైర్ అయ్యారు. ‘‘సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేసి రాజకీయ కుట్రకు కేసీఆర్ తెరలేపిండు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చేది బీజేపీనే” అని పేర్కొన్నారు.
కేసీఆర్‌వి నిరంకుశ విధానాలు : నూనె బాల్ రాజ్
సంజయ్ అరెస్టు అప్రజాస్వామికమని బీజేపీ జాతీయ నేత నూనె బాల్ రాజ్ ఖం డించారు. బీఆర్ఎస్ పాలనలో విచ్చలవిడి గా అవినీతి పెరిగిపో యిందని, అక్రమాలకు అడ్డు, అదుపు లేకుం డా పోయిందని, ప్రశ్న పత్రాల లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతున్నదని ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రశ్నిస్తే బీజేపీ నేతలను అరెస్టు చేస్తూ నిరంకుశ విధానాలను కేసీఆర్ చాటుకుంటున్నారన్నారు.
సిగ్గుమాలిన చర్య: డీకే అరుణ
‘‘సంజయ్‌ను అకారణంగా అరెస్టు చేయడం సిగ్గుమాలిన చర్య. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అని చూడకుండా అర్ధ రాత్రి అరెస్టు చేయడం ఏమిటి?’’ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రకట నలో ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు కాలం చెల్లిందని, త్వరలోనే ఆ పార్టీని తెలంగాణలో బొంద పెట్టడం ఖాయమని హెచ్చరించారు.