నేడు హైదరాబాద్ కు మోడీ, అమిత్ షా

నేడు హైదరాబాద్ కు మోడీ, అమిత్ షా
  • కుటుంబ పాలన పై పోరు
  • దక్షిణాదిలో పార్టీ బలోపేతం
  • ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడం
  • ఇవే బిజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాన ఎజెండా
  • ఇయ్యాల, రేపు సమావేశాలు
  • హైదరాబాద్ కు చేరుకున్న జేపీ నడ్డా స్వాగతం పలికిన నేతలు 
  • నోవాటెల్ లో తెలంగాణ చరిత్రను చాటే ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం 
  • జాతీయ ప్రధాన కార్యదర్శులతో నడ్డా భేటీ..ఎజెండా, ముసాయిదా తీర్మానల పై చర్చ 
  • నేడు ప్రధాని మోడీ, అమిత్ షా రాక


 
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా శనివారం నుంచి రెండు రోజుల పాటు జరుగను న్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమా వేశాలకు ఒక్క రోజు ముందుగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు | జేపీ నడ్డా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. దక్షిణాదిలో బీజేపీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణ పై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ముసాయిదా తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. కర్నాటక తర్వాత తెలంగాణలోనే పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎక్కువ స్కోప్ ఉందని, ఆ దిశగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశాన్ని కూడా ఎజెండాలో చే ర్చనున్నారు. తెలంగాణతో పాటు ప్రాంతీయ పార్టీలు అధి కారంలో ఉన్న రాష్ట్రాల్లో కుటుంబ పాలన సాగుతున్నదని. కుటుంబ పాలన వల్ల అవినీతి పెరిగిపోతున్నదని, దాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని ముసాయిదా తీర్మానంలో చేర్చారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లోని ఏజెండా. ముసాయిదా తీర్మానాలపై రాత్రి 10 గంటల నుంచి అర్ధరా త్రి వరకు నోవాటెల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో జేపీ నడ్డా సమావేశమై చర్చించారు.

ఇందులో తరుణ్​చుగ్​, శివప్రకాశ్​, పురందేశ్వరి సహా మొత్తం 10 మంది పాల్గొన్నారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, వాటిని అధిగమించడం, జాతీయ అంతర్జాతీయ సంబంధాలు, త్వరలో జరగనున్న గుజరాత్​, హిమాచల్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించడం,  ఆ తర్వాత జరుగబోయే కర్నాటక, తెలంగాణ ఎన్నికల్లో గెలుపు కోసం ఎలా ముందుకుపోవడం, మోడీ ఎనిమిదేండ్ల పాలనలో సాధించిన ప్రగతి, బీజేపీ పాలనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టడం వంటి అంశాలపైనా జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో చర్చించారు. ఈ చర్చించిన అంశాలను శనివారం ఉదయం జరిగే నేషనల్​ ఆఫీస్​ బేరర్ల మీటింగ్​ముందు ఉంచి..  సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. అవసరమైన మేరకు మార్పులు చేర్పులు కూడా చేసే అవకాశం ఉంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వీటిని ప్రవేశపెట్టనున్నారు. కార్యవర్గ సమావేశాల్లో మొదట జేపీ నడ్డా అధ్యక్ష ఉపన్యాసం చేస్తారు. మరుసటి రోజు (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగంతో సమావేశాలు ముగుస్తాయి. 

తెలంగాణను చరిత్రను చాటే ఫొటో ఎగ్జిబిషన్​

హెచ్​ఐసీసీ నోవాటెల్ లో రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను జ్యోతి ప్రజ్వలన చేసి జేపీ నడ్డా ప్రారంభించారు. సర్దార్  వల్లాభాయ్​ పటేల్ ముందు నిజాం లొంగిపోయినప్పటి ఫొటోతో పాటు నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, కొమురంభీం, షోయబుల్లాఖాన్ వంటి వారి చరిత్రను తెలిపే ఫొటోలను ప్రదర్శించారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో అమరులైన వారి చిత్రాలను ఏర్పాటు చేశారు. మోడీ ఎనిమిదేండ్ల పాలనను వివరించే ఫొటోలను ప్రదర్శనలో ఉంచారు. తెలంగాణ చరిత్ర, పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలను కండ్లకు కట్టే చిత్రాలు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో బీజేపీ పోషించిన పాత్రకు సంబంధించిన ఫొటోలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ నగిషీ కళాకారుల నైపుణ్యాన్ని ప్రతిబింబించే సిల్వర్ పిలిగ్రీలను, తెలంగాణ చేనేత కళాకారుల ప్రతిభకు పట్టంకట్టే గద్వాల, పోచంపల్లి చీరలను ఇందులో ప్రదర్శించారు. వీటన్నింటినీ ఆసక్తిగా చూసిన నడ్డా.. పార్టీ రాష్ట్ర నేతలను అభినందించారు. 

నేడు మధ్యాహ్నం మోడీ రాక

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు శనివారం హైదరాబాద్ కు రానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం12.45 గంటలకు బయలుదేరనున్న మోడీ మధ్యాహ్నం 2. 55 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 3.20 గంటలకు హెచ్ఐసీసీ నోవాటెల్​కు వస్తారు. సాయంత్రం 4 గంటలకు నోవాటెల్ లో జరుగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో  పాల్గొంటారు.  రాత్రి 9 గంటల వరకు కొనసాగునున్న ఈ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. అనంతరం అక్కడే బస చేస్తారు. పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు గురువారమే హైదరాబాద్ చేరుకొని తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటున్నారు. వీరంతా శనివారం సాయంత్రం 4 గంటలకు నోవాటెల్ కు చేరుకొని జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4. 30 గంటల వరకు రెండో రోజు జాతీయ కార్యవర్గ సమావేశాలు  జరుగుతాయి. ఇందులోనూ ప్రధాని మోడీ పాల్గొంటారు. సాయంత్రం పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ రోజు రాత్రి రాజ్ భవన్ లేదా నోవాటెల్ లో బస చేస్తారు.

మోడీ సభకు విస్తృతమైన ఏర్పాట్లు

ఆదివారం విజయ సంకల్ప సభ పేరుతో పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న ప్రధాని మోడీ సభకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి శుక్రవారం పరేడ్ గ్రౌండ్ కు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. సభలో మొత్తం నాలుగు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక వేదికపై మోడీ, నడ్డా, అమిత్ షా, రాజ్‌‌నాథ్ సింగ్, గడ్కరీ, కిషన్ రెడ్డి, సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ ఉంటారు. రెండో వేదికపై పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు కూర్చుంటారు. మూడో వేదికపై పార్టీ జాతీయ నేతలు ఉంటారు. నాలుగో వేదికపై సాంస్కృతిక బృందాల కళా ప్రదర్శనలు ఉంటాయి.  

నడ్డాకు ఘన స్వాగతం

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన జేపీ నడ్డాకు  పార్టీ ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. వీరిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, పార్టీ నేతలు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఎయిర్​పోర్టు నుంచి శంషాబాద్ టౌన్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఇందులో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నడ్డాపై కార్యకర్తలు పూలు చల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్ మధ్య నడ్డా నేరుగా సమావేశాలు జరుగనున్న హెచ్ఐసీసీ నోవాటెల్ కు వెళ్లారు. నోవాటెల్​లో ఆయనకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ తరుణ్ చుగ్, పార్టీ సంస్థాగత జాతీయ సహాయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, పలువురు రాష్ట్ర నేతలు స్వాగతం పలికారు.