బీజేపీ సమావేశాలు సక్సెస్

బీజేపీ సమావేశాలు సక్సెస్

హైదరాబాద్​, వెలుగు: రెండు రోజుల పాటు హైదరాబాద్​లోని హెచ్​ఐసీసీ నోవాటెల్​లో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు సక్సెస్ అయ్యాయి. ఈ సమావేశాలు రాష్ట్ర పార్టీ నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు జరిగిన ఈ మీటింగ్ లకు ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు సహా మొత్తం 355 మంది  హాజరయ్యారు. ఇక ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్​లోని పరేడ్​ గ్రౌండ్​లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో అమిత్ షా, బండి సంజయ్ , జేపీ నడ్డా ప్రసంగాలు పార్టీ కేడర్​లో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రత్నామ్నాయం తామే అనే విషయాన్ని జనంలోకి బలంగా పంపించినట్లు అయిందని నేతలు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని, కుటుంబ పాలనకు చరమగీతం పాడుతామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

పలు అంశాలపై చర్చ
రాజకీయ, ఆర్థిక , విదేశాంగ విధానాలపై బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పలువురు నేతలు, కేంద్ర మంత్రులు తీర్మానాలు ప్రవేశపెట్టగా.. వాటిపై చర్చ జరిగింది. తెలంగాణపై ప్రత్యేకంగా చర్చజరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరలేదని బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది. తీర్మానాలు, చర్చించిన అంశాలు, మాట్లాడిన అంశాలపై పలువురు కేంద్ర మంత్రులు, సీఎంలు మీడియాకు వివరించారు. 

నేడు సంస్థాగత మీటింగ్ 
సోమవారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు హెచ్ ఐ సీసీ నోవాటెల్ లో  దేశంలోని అన్ని రాష్ట్రాల బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం కానున్నారు. ఇటీవల కాలం వరకు ఆయా రాష్ట్రాల్లో  పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయటం కోసం ఏం చేయాలన్నది నడ్డా దిశానిర్దేశం చేయనున్నారు.