ATMలు నిరంతరం పనిచేసేలా SBI మాస్టర్ ప్లాన్.. ఆ కంపెనీతో వెయ్యి కోట్లకు డీల్..

 ATMలు నిరంతరం పనిచేసేలా SBI మాస్టర్ ప్లాన్.. ఆ కంపెనీతో వెయ్యి కోట్లకు డీల్..

దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఏటీఎం సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 5వేల ఏటీఎంల నిర్వహణ బాధ్యతను ప్రముఖ లాజిస్టిక్స్ అండ్ టెక్నాలజీ సంస్థ CMS ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్‌కు అప్పగించింది. దీని కోసం రూ.వెయ్యి కోట్ల విలువైన భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

10 ఏళ్ల పాటు సేవలు..
ఈ కాంట్రాక్ట్ కాలపరిమితి 10 ఏళ్లు. జనవరి 2026 నుంచి ఈ కొత్త ఒప్పందం అమలులోకి రానుంది. దీని కింద సెలెక్టెడ్ 5వేల స్టేట్ బ్యాంక్ ఏటీఎంలలో నగదు నింపడం, మెషిన్లు నిరంతరం పనిచేసేలా చూడటం, సాంకేతిక లోపాలను సరిదిద్దడం వంటి బాధ్యతలను CMS చూసుకుంటుంది. ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇంత పెద్ద ఎత్తున ఏటీఎం కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థకు అవుట్‌సోర్సింగ్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

వినియోగదారులకు ప్రయోజనాలు..
సాధారణంగా పండుగలు లేదా సెలవులు వంటి రోజుల్లో ఏటీఎంలలో క్యాష్ అయిపోవడం, మిషన్లు పనిచేయకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ ఒప్పందం వల్ల ఎస్‌బీఐ కస్టమర్లకు అటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే 'డౌన్ టైమ్' తగ్గించడం ద్వారా లక్షల మంది కస్టమర్లకు నిరంతర బ్యాంకింగ్ సేవలు అందుతాయని సంస్థ భావిస్తోంది.

టెక్నాలజీతో సేవలు..
గతంలో కూడా ఎస్‌బీఐ, సీఎంఎస్ సంస్థలు కలిసి పనిచేసిన అనుభవం ఉంది. ముఖ్యంగా ALGO MVS సాఫ్ట్‌వేర్, HAWKAI విజన్ ఏఐ వంటి అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించి ఏటీఎంలను పర్యవేక్షించడంలో సీఎంఎస్ తన ప్రత్యేకతను చూపించింది.

ఈ భారీ కాంట్రాక్ట్ వల్ల తమ సంస్థకు అదనంగా రూ. 500 కోట్ల ఆదాయం సమకూరుతుందని సీఎంఎస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అనుష్ రాఘవన్ తెలిపారు. 2025లో బ్యాంకింగ్ రంగం ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించడంలో తాము కీలక పాత్ర పోషించామని, ఈ సుదీర్ఘ కాలపు ఒప్పందం సంస్థకు మరింత స్థిరత్వాన్ని ఇస్తుందని అన్నారు.