Usman Khawaja: విజయంతో వీడ్కోలు.. కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడేసిన ఆసీస్ దిగ్గజ క్రికెటర్

Usman Khawaja: విజయంతో వీడ్కోలు.. కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడేసిన ఆసీస్ దిగ్గజ క్రికెటర్

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, టెస్ట్ స్పెషలిస్ట్ ఉస్మాన్ ఖవాజా తన అంతర్జాతీయర్ క్రికెట్ ను ముగించాడు. యాషెస్ లో భాగంగా గురువారం (జనవరి 9) ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్టులో ఖవాజా తన చివరి ఇన్నింగ్స్ ఆడేశాడు. వారం క్రితమే సిడ్నీ టెస్ట్ తన చివరిదని చెప్పిన ఈ ఆసీస్ ఓపెనర్.. గురువారం మ్యాచ్ ముగిసిన తర్వాత గుడ్ బై చెప్పాడు.  ఖవాజా తన చివరి ఇన్నింగ్స్ లో 6 పరుగులు మాత్రమే చేసి జోష్ టంగ్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 17 పరుగులతో సరిపెట్టుకున్నాడు. మ్యాచ్ లో తాను రాణించకపోయినా ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించి ఖవాజాకు గ్రాండ్ గా వీడ్కోలు పలికాడు. 

కెరీర్ మొత్తం ఓపెనర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఖవాజా.. తన చివరి మ్యాచ్ లో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్ తర్వాత ఈ ఆసీస్ ఓపెనర్ తన ఫ్యామిలీతో గ్రౌండ్ లో చివరిసారిగా కాసేపు సరదాగా గడిపాడు. ఇరు జట్లు ఖవాజాకు గార్డ్ ఆఫ్ హానర్ తో గౌరవించారు. ఆస్ట్రేలియా తరపున 15 ఏళ్ళు టెస్ట్  క్రికెట్ ఆడి స్టార్ ఓపెనర్ గా పేరొందిన ఉస్మాన్.. తన చివరి ఇన్నింగ్స్ లో ఔటైన తర్వాత ఎమోషనల్ అయ్యాడు. ఇప్పటికే వార్నర్ రూపంలో ఆసీస్ ఓపెనర్ సేవలను కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఖవాజా రిటైర్మెంట్ తో ఆసీస్ ఎవరిని రీప్లేస్ మెంట్ చేస్తుందో చూడాలి. 

ఖవాజా చిన్నతనంలో ఇస్లామాబాద్ నుండి ఆస్ట్రేలియాకు వలస వచ్చాడు. తాను ఒక ముస్లీమ్ గా ఆస్ట్రేలియా జట్టులో స్థానం సంపాదించడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. 2011లో తొలిసారి ఆస్ట్రేలియా తరపున ఖవాజా టెస్ట్ అరంగేట్రం చేశాడు. అవకాశం వచ్చినప్పుడల్లా ఖవాజా తనను తాను నిరూపించుకొని జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. 39 ఏళ్ళ ఈ ఆసీస్ ఓపెనర్ ఓవరాల్ గా 88 టెస్టులు ఆడాడు. 42.66 యావరేజ్ తో 6229 పరుగులు చేశాడు. వీటిలో 16 సెంచరీలు.. 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన తొలి టెస్ట్ సిడ్నీలో ఆడిన ఖవాజా.. చివరి టెస్ట్ కూడా అక్కడే ఆడి విజయంతో ముగించాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే గురువారం (జనవరి 8) ఇంగ్లాండ్ తో ముగిసిన ఐదో టెస్టులో 5 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించి 4-1 తేడాతో యాషెస్ ను తమ ఖాతాలో వేసుకుంది. ఇంగ్లాండ్ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లకు కోల్పోయి ఆస్ట్రేలియా అలవోకగా ఛేజ్ చేసింది. తొలి మూడు టెస్టులో ఆస్ట్రేలియా గెలిస్తే.. నాలుగో టెస్ట్ లో ఇంగ్లాండ్ గెలిచింది. తాజాగా ముగిసిన ఐదో టెస్టులో ఆస్ట్రేలియా గెలిచి 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టిన హెడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. సిరీస్ మొత్తం బౌలింగ్ తో చెలరేగిన స్టార్క్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.