ప్రాణాలు పోతున్నా తగ్గని పన్ను: ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీ తగ్గింపునకు మోడీ సర్కార్ 'NO'

ప్రాణాలు పోతున్నా తగ్గని పన్ను: ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీ తగ్గింపునకు మోడీ సర్కార్ 'NO'

వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుని ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటే, ఎయిర్ ప్యూరిఫయర్ల ధరలను తగ్గించే విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గాలి నాణ్యత తగ్గటంతో ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాసకోశ సమస్యలతో పాటు గుండె పోటు ముప్పులు పెరిగాయి.  ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో ఎయిర్ ప్యూరిఫయర్లను విలాసవంతమైన వస్తువులుగా కాకుండా ఆరోగ్య పరికరాలుగా గుర్తించి వాటిపై జీఎస్టీని తగ్గించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విషయంలో తక్షణ ఉపశమనం కలిగించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

హైకోర్టులో కేంద్రం వాదన ఏంటి?
ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీని తగ్గించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం అఫిడవిట్ సమర్పించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 279A ప్రకారం.. జీఎస్టీ రేట్లపై నిర్ణయం తీసుకునే అధికారం కేవలం జీఎస్టీ కౌన్సిల్ కు మాత్రమే ఉందని, కేంద్ర ప్రభుత్వం నేరుగా ఎలాంటి మార్పులు చేయలేదని తేల్చి చెప్పేసింది. రేట్ల తగ్గింపు అనేది కేవలం కార్యనిర్వాహక నిర్ణయం కాదని.. దీనికి కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం అవసరమని బీజేపీ ప్రభుత్వం కోర్టుకు వివరించింది.

ALSO READ : స్కూల్ బ్యాగ్ బరువు, లాస్ట్ బెంచ్ విధానంకి చెక్..

బడ్జెట్ తర్వాతే చర్చ..
ప్రస్తుతం ఎయిర్ ప్యూరిఫయర్లపై 18 శాతం జీఎస్టీ అమల్లో ఉంది. ఫిబ్రవరిలో జరగనున్న కేంద్ర బడ్జెట్ కంటే ముందు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అయ్యే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో కేవలం ఒక్క ఎయిర్ ప్యూరిఫయర్ల రేట్ల అంశంపై కౌన్సిల్‌ను పిలవడం సాధ్యం కాదని, బడ్జెట్ తర్వాత జరిగే సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

ఢిల్లీ వంటి నగరాల్లో కాలుష్యం ఎక్కువగా ఉందని, అక్కడ మాత్రమే పన్ను తగ్గింపు ఇవ్వాలని కొందరు కోరుతున్నారు. కానీ.. జీఎస్టీ చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా పన్ను రేట్లు ఒకేలా ఉండాలని, ఏదైనా ఒక ప్రాంతానికి ప్రత్యేక మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం అంటోంది. ఎయిర్ ప్యూరిఫయర్లను ఎలక్ట్రానిక్ వస్తువులుగా వర్గీకరించినందున, పన్ను తగ్గిస్తే రాష్ట్రాల ఆదాయంపై ప్రభావం పడుతుందని, అందుకే ఆచితూచి అడుగు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ALSO READ : గ్రేట్ జాబ్ బ్రదర్

కేంద్ర ప్రభుత్వ వాదన ఒకలా ఉండే సగటు సామాన్యుడి ఆవేదన మరోలా ఉంది. గాలి కాలుష్యం వల్ల ఆసుపత్రుల పాలవుతున్న ఢిల్లీలోని సామాన్యులు ప్రాణాలు నిలిపే ప్యూరిఫయర్లను కొనుగోలు చేయడం భారంగా మారిందంటున్నారు. 18 శాతం పన్నును కనీసం 5 శాతానికి తగ్గిస్తే ప్రాణవాయువును కొనుగోలు చేసే శక్తి లభిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు బడ్జెట్ తర్వాతైనా జీఎస్టీ కౌన్సిల్ సామాన్యుడికి ఊరటనిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.