స్కూల్ బ్యాగ్ బరువు, లాస్ట్ బెంచ్ విధానంకి చెక్.. ఇకపై రోజుకు 4 సబ్జెక్టులే !

 స్కూల్ బ్యాగ్ బరువు, లాస్ట్ బెంచ్ విధానంకి చెక్..  ఇకపై రోజుకు 4 సబ్జెక్టులే !

కేరళ విద్యాశాఖ స్కూళ్లలో భారీ మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా క్లాస్ రూమ్‌లో లాస్ట్ బెంచ్ (బ్యాక్-బెంచ్) విధానాన్ని రద్దు చేయడం, స్కూల్ బ్యాగుల బరువును తగ్గించడం వంటి కీలక విషయాల పై ప్రజల అభిప్రాయాలను కోరుతోంది.

 సీటింగ్ పద్ధతిలో మార్పు కోసం క్లాస్‌లో వెనుక బెంచీలు అనేవి లేకుండా అందరూ సమానంగా ఉండేలా చూడటం, 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న క్లాసుల్లో 'U' ఆకారంలో బెంచీలు ఏర్పాటు చేయాలని నిపుణుల కమిటీ సూచించింది.

స్కూల్ బ్యాగ్ బరువు తగ్గింపు విషయంలో  పిల్లలు మోసే స్కూల్ బ్యాగుల బరువును తగ్గించడానికి సిలబస్‌ను మార్చాలని చూస్తున్నారు. అలాగే రోజుకు కేవలం 3 లేదా 4 సబ్జెక్టులు మాత్రమే ఉండేలా టైమ్ టేబుల్ రూపొందించాలని ప్రతిపాదించారు.

Also Read : అర్ధరాత్రి ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ చేసిన పనికి ఇంటర్నెట్ ఫిదా

 స్కూలులోనే పుస్తకాలు దాచుకోవడానికి లాకర్లు ఏర్పాటు చేయడం, అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే నోట్‌బుక్ వాడటం, డిజిటల్ పుస్తకాలను ప్రోత్సహించడం వంటివి చేయాలని కమిటీ చెప్పింది.

 ప్రస్తుతం ఒకటో తరగతి పిల్లలు సుమారు 1.6 నుండి 2.2 కిలోలు, పదో తరగతి విద్యార్థులు 2.5 నుండి 4.5 కిలోల బరువున్న బ్యాగులను మోస్తున్నారు. ఈ భారాన్ని తగ్గించేందుకు ఇప్పటికే పాఠ్యపుస్తకాలను రెండు భాగాలుగా ముద్రిస్తున్నారు. భవిష్యత్తులో  Bagless System తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ఈ మార్పులపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహా  సామాన్య ప్రజలు సూచనలను అందించవచ్చు. పూర్తి నివేదికలు SCERT అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాగే మీ అభిప్రాయాలను తెలియజేయడానికి జనవరి 20 వరకు గడువు ఉంది. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే విద్యాశాఖ మంత్రి వి. శివన్‌కుట్టి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ సంస్కరణలపై  నిర్ణయం తీసుకుంటుంది.