మీరు తినే బెల్లం ఎంతవరకు సేఫ్ ? అసలైన బెల్లంని, కల్తీ బెల్లంని గుర్తించడం ఎలా.. కొన్ని ఇంటి చిట్కా పద్ధతులతో మీరు ఇంట్లోనే తెలుసుకోవచ్చు... బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. చెక్కరకి బదులు చాలామంది బెల్లంని వాడుతుంటారు. కానీ, లాభం కోసం మార్కెట్లో రసాయనాలు కలిపిన నకిలీ బెల్లంని అమ్ముతుంటారు. ఇలాంటి కల్తీ బెల్లం తింటే అనారోగ్యం కొని తెచుకున్నట్టే. అందుకే కొనే ముందు ఈ చిన్న పరీక్షలు చేయండి.
1. అసలైన బెల్లం చెరకు రసం నుంచి వచ్చే సహజమైన తియ్యటి వాసన వస్తుంది. కానీ నకిలీ బెల్లంలో రసాయనాలు కలపడం వల్ల వింతగా లేదా ఘాటుగా వాసన వస్తుంది. కొన్నిసార్లు అసలు వాసనే ఉండదు.
2. నీటి పరీక్ష కోసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిన్న బెల్లం ముక్క వేయండి. అసలైన బెల్లం అయితే నీటిలో మెల్లిగా కరుగుతుంది. నీరు కూడా తేటగా ఉంటుంది. నకిలీ బెల్లంలో రంగులు కలిపితే నీరు వెంటనే ముదురు రంగులోకి మారిపోతుంది. అడుగున ఇసుక లేదా సున్నం లాంటి వ్యర్థాలు పేరుకుపోతాయి.
3. బెల్లం రంగును గమనిస్తే అసలైన బెల్లం సాధారణంగా లేత గోధుమ రంగు లేదా డార్క్ చాక్లెట్ రంగులో ఉంటుంది. కానీ నకిలీ బెల్లం చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండాలని దీనికి పసుపు రంగు కలర్ వేస్తారు. బాగా పసుపుగా లేదా తెల్లగా మెరిసిపోతున్న బెల్లాన్ని అస్సలు కొనకండి.
4. రుచి చూస్తే తెలుసుకునేందుకు అసలైన బెల్లం తిన్నప్పుడు కమ్మని తీపి ఉంటుంది. నకిలీ బెల్లంలో ఉప్పు లేదా సోడా కలిపితే కొంచెం ఉప్పగా లేదా చేదుగా అనిపిస్తుంది. తిన్న తర్వాత గొంతులో మంటగా అనిపించినా అది కల్తీ బెల్లం అని తెల్సుకోవాలి.
5. చిన్న బెల్లం ముక్కను వేళ్ల మధ్య నలిపి చూడండి. అసలైన బెల్లం మెత్తగా ఉండి, ఈజీగా నలిగిపోతుంది. నకిలీ బెల్లం చాలా గట్టిగా ఉంటుంది. చేతికి జిగటగా లేదా ప్లాస్టిక్ లాగా అంటుకుంటుంటే అది మంచిది కాదని తెలుసుకోవాలి.
