ఆర్కిటిక్‌లో యుద్ధ మేఘాలు: అమెరికా సైన్యం వస్తే కాల్చిపారేయండి.. డెన్మార్క్ ఆదేశాలు

ఆర్కిటిక్‌లో యుద్ధ మేఘాలు: అమెరికా సైన్యం వస్తే కాల్చిపారేయండి.. డెన్మార్క్ ఆదేశాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపు ఇప్పుడు ఆర్కిటిక్ ద్వీపం గ్రీన్‌లాండ్‌పై పడింది. అయితే ఈ ద్వీపంపై పట్టు కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలను కమ్మేలా చేస్తున్నాయి. డెన్మార్క్ పరిధిలో ఉండే ఈ స్వయంప్రతిపత్తి గల భూభాగాన్ని దక్కించుకోవడానికి అమెరికా సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని సంకేతాలు ఇవ్వడంతో.. డెన్మార్క్ రక్షణ మంత్రిత్వ శాఖ తన సైనికులకు అత్యంత కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. 

డెన్మార్క్ సంచలన ఆదేశాలు: షూట్ ఫస్ట్ 
ఒకవేళ అమెరికా సైనికులు గ్రీన్‌లాండ్‌ను బలవంతంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే.. ఎవరి ఆదేశాల కోసం ఎదురు చూడకుండా "ముందు కాల్పులు జరపండి.. ఆ తర్వాతే ప్రశ్నలు అడగండి" అంటూ డెన్మార్క్ తన సైనికులకు స్పష్టం చేసింది. 1952 నాటి ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి నిబంధనను డెన్మార్క్ ఇప్పుడు తెరపైకి తెచ్చింది. దీని ప్రకారం.. విదేశీ శక్తులు దాడికి దిగినప్పుడు ఉన్నతాధికారుల అనుమతి లేకపోయినా యుద్ధం ప్రకటించినట్లు సమాచారం అందకపోయినా సరే మిలిటరీ ఎదురుదాడి ప్రారంభించాల్సి ఉంటుంది. 1940లో నాజీ జర్మనీ ఆకస్మిక దాడి చేసినప్పుడు ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అప్పట్లో డెన్మార్క్ తెచ్చిన ఈ పాత చట్టాన్ని ఇప్పటికీ అమలులో ఉంచింది.

ట్రంప్ పంతం వెనుక కారణమేంటి..? 
ఇటీవలే వెనిజులాపై దాడులు జరిపి అక్కడి నాయకుడు నికోలస్ మదురోను పట్టుకున్న ఉత్సాహంలో ఉన్న ట్రంప్, ఇప్పుడు గ్రీన్‌లాండ్ అమెరికా భద్రతకు అత్యంత కీలకమని భావిస్తున్నారు. గ్రీన్‌లాండ్ తీరప్రాంతం చుట్టూ రష్యా, చైనా నౌకలు తిరుగుతున్నాయని, జాతీయ భద్రత దృష్ట్యా ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం తమ ప్రాధాన్యతని ట్రంప్ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఒకవేళ నాటో మిత్రదేశాల సంబంధాలు దెబ్బతిన్నా సరే గ్రీన్‌లాండ్ ను వదులుకోమని చెప్తుండటం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. నాటోతో మైత్రి లేదా గ్రీన్‌లాండ్ స్వాధీనమా? ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి రావచ్చంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింతగా పెంచేస్తున్నాయి. 

అమెరికా చర్యలను గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్-ఫ్రెడరిక్ నీల్సన్ తీవ్రంగా ఖండించారు. గ్రీన్‌లాండ్ అంశాన్ని వెనిజులా సైనిక చర్యలతో పోల్చడం గౌరవప్రదం కాదని, తమ ప్రాంతం అమ్మకానికి లేదని స్పష్టం చేశారు. ఈ వివాదాన్ని సర్దుబాటు చేసేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, వైట్ హౌస్ అధికారులు డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. అయినప్పటికీ డెన్మార్క్ మాత్రం తన సైన్యాన్ని అప్రమత్తం చేస్తూ యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలు ఇవ్వడం ఇప్పుడు ఆర్కిటిక్ ప్రాంతాన్ని హాట్ హాట్ గా మార్చింది.