టాలీవుడ్ బ్యూటీ సమంత ఈ సారి రూటు మార్చేసింది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ ఈ సారి యాక్షన్ మోడ్ లోకి వచ్చేసింది. లేటెస్ట్ ఆమె నటిస్తున్న మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) టీజర్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాను ఊపేస్తోంది. పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ టాలీవుడ్‌లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత.. ఈ చిత్రంతో పూర్తిస్థాయి యాక్షన్ మోడ్‌లోకి మారిపోయారు.
అమాయకత్వం వెనుక దాగున్న అగ్నిపర్వతం
"మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది.." అంటూ మొదలైన ఈ టీజర్, ఆరంభంలో ఒక సాధారణ మధ్యతరగతి గృహిణి కథలా అనిపించినా, వెనువెంటనే ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి మారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా బస్సులో చీరకట్టుతో, చేతిలో కత్తి పట్టుకుని రగ్డ్ లుక్‌లో సామ్ చేసిన ఫైట్స్ చూస్తుంటే, ఆమె ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’ అనుభవాన్ని ఇక్కడ వెండితెరపై ప్రదర్శించినట్లు కనిపిస్తోంది. 1980ల నాటి క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ కథలో సమంత బాడీ డబుల్ లేకుండా స్వయంగా స్టంట్స్ చేయడం విశేషం.
సమంత - నందిని రెడ్డిమ్యాజిక్ రిపీట్ అవుతుందా?
గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓ బేబీ’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ సక్సెస్ ఫుల్ జోడీ ‘మా ఇంటి బంగారం’ కోసం జతకట్టింది. అయితే ఈసారి నందిని రెడ్డి తన మార్కు ఎమోషన్స్‌తో పాటు రాజ్ నిడిమోరు శైలిలో ఉండే ఇంటెన్స్ యాక్షన్‌ను జోడించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని స్వయంగా సమంత తన సొంత బ్యానర్ ‘త్రలాల మూవీంగ్ పిక్చర్స్’పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరుతో కలిసి నిర్మిస్తోంది.
అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
ఈ సినిమాలో సమంతతో పాటు ‘కాంతారా చాప్టర్ 1’ ఫేమ్ గుల్షన్ దేవయ్య, కన్నడ స్టార్ దిగంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరికి తోడు సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆయన అందించే సంగీతం ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు ప్రధాన బలంగా మారుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
కొత్త ప్రయాణం
సమంత ఇటీవలే దర్శకుడు రాజ్ నిడిమోరును కోయంబత్తూరులో నిరాడంబరంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఆమె నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. నటిగానే కాకుండా నిర్మాతగా మారింది. గుండెకు హత్తుకునే కథలను చెప్పాలనే లక్ష్యంతో ఈ సినిమాను నిర్మించాం అని సమంత తన ఆనందాన్ని పంచుకున్నారు. "This GOLD is BLOODY BOLD" అంటూ సమంత ఇచ్చిన క్యాప్షన్ ఈ సినిమా స్వభావాన్ని తెలియజేస్తోంది. 2025లో ‘శుభం’ అనే చిత్రంలో అతిథి పాత్రలో మెరిసిన సామ్, ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’తో పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు.
