Vijay Jana Nayagan: జనవరి 9న విడుదల కష్టమే.. విజయ్ జననాయగన్ కేసులో తీర్పు రిజర్వ్

Vijay Jana Nayagan: జనవరి 9న విడుదల కష్టమే.. విజయ్ జననాయగన్ కేసులో తీర్పు రిజర్వ్

విజయ్ జననాయగన్ సినిమాను సెన్సార్ గండం వెంటాడుతోంది. CBFC ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో విజయ్ చివరి సినిమాకు విడుదల కష్టాలు తప్పడం లేదు. సెన్సార్డ్ బోర్డ్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని మద్రాస్ హైకోర్టులో చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ వాదించింది. ఈ సినిమా మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని, సాయుధ దళాలను అభ్యంతరకరమైన రీతిలో చిత్రీకరించిందని ఆరోపిస్తూ నిర్మాతలకు సెన్సార్ బోర్డ్ నుంచి ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే.

సర్టిఫికేషన్ ప్రక్రియ ముగిశాక ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏంటని చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. సినిమా విడుదలకు సమయం దగ్గర పడిందని.. తక్షణమే సర్టిఫికెట్ ఇష్యూ చేయాలని సెన్సార్ బోర్డ్ను ఆదేశించాలని జననాయగన్ నిర్మాణ సంస్థ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. ఇరు పక్షాల వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. జనవరి 9న ఉదయం తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.

►ALSO READ | Dhurandhar Box Office: 'పుష్ప2' రికార్డులు బద్దలు.. బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ విశ్వరూపం!

కోర్టు తీర్పు ఆలస్యం అయ్యే పరిస్థితులు ఉండటంతో తొలుత ప్రకటించిన జనవరి 9న సినిమా విడుదలవుతుందో.. లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలపై విజయ్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తమ హీరోను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని.. ఈ పరిణామాల వెనుక రాజకీయ కుట్ర ఉందని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు.

తమిళ్లో జనవరి 9న విడుదలవుతుందో.. లేదో.. సందేహమే. జనవరి 9న తెలుగు, హిందీ వెర్షన్స్ విడుదలకు ఛాన్స్ లేనట్టేనని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. జనవరి 9న జననాయగన్ తెలుగులో విడుదలయ్యే ఛాన్స్ లేకపోవడంతో ‘రాజాసాబ్‘ సోలో రిలీజ్కు మంచి ఛాన్స్ దొరికింది.