బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆదిత్యధర్ దర్శకత్వంలో వచ్చిన హైవోల్టేజ్ స్పై థ్రిల్లర్ ' ధురంధర్ ' డిసెంబర్ 5, 2025న విడుదలైంది. తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు ఈ మూవీ భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1240 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. టాలీవుడ్ సన్సేషన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ 'పుష్ప 2' రికార్డులకు తిరగరాసింది.
'పుష్ప 2' రికార్డు బద్దలు!
' ధురంధర్ ' మూవీ విడుదలై 34 రోజులు అవుతున్నా బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను కొనసాగిస్తూనే ఉంది. 33వ రోజు మంగళవారం ఈ సినిమా సుమారు రూ.5.70 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో కలిపి భారత్‌లో మొత్తం నెట్ వసూళ్లు రూ.831.40 కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు హిందీ మార్కెట్‌లో సుమారు రూ. 830 కోట్లతో ఆల్-టైమ్ రికార్డును కలిగి ఉన్న అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' వసూళ్లను 'ధురంధర్' అధిగమించింది. గత ఎనిమిదేళ్లుగా 'బాహుబలి 2' పేరిట ఉన్న రికార్డును 'పుష్ప 2' చెరిపివేస్తే.. ఆ రికార్డును రణవీర్ సింగ్ చేరిపేసి తన ఖాతాలో వేసుకున్నారు.
రణవీర్ విశ్వరూపం
ఈ మూవీలో రణవీర్ ఒక శక్తివంతమైన గూఢచారి (Spy) హంజా అలీ మజారీ పాత్రలో నటించారు. అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ఛేదించే ఒక సీక్రెట్ మిషన్‌లో భాగంగా ఆయన నటన, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ భారీ యాక్షన్ డ్రామాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్ , అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించారు. ఆదిత్య ధర్ అద్భుతమైన టేకింగ్, జియో స్టూడియోస్ నిర్మాణ విలువలు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
►ALSO READ | BMW Trailer Review: ప్రేక్షక మహాశయులకు పండుగ షురూ.. రవితేజ కొత్త సినిమా ట్రైలర్ అదిరిపోయింది
ప్రశంసల జల్లు..
ఈ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భంగా బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పందిస్తూ.. ధురంధర్ కేవలం ఒక సినిమా కాదు, ఇది భారతీయ సినిమా గర్వించదగ్గ మైలురాయి. ఆదిత్య ధర్, జియో స్టూడియోస్‌కు అభినందనలు అంటూ ప్రశంసలు కురిపించింది. ఈ పోస్ట్‌కు రణవీర్ సింగ్ స్పందిస్తూ, తన మాతృసంస్థ లాంటి వైఆర్ఎఫ్ గర్వపడేలా చేయడం ఆనందంగా ఉందని ఎమోషనల్ అయ్యారు.
— Yash Raj Films (@yrf) January 7, 2026
బాక్సాఫీస్ సునామీ..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1,240 కోట్ల మార్కును దాటేసింది. ఈ సినిమా లాంగ్ రన్‌లో ఇండియాలో రూ. 900 కోట్ల మార్కును అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నెగటివ్ రివ్యూలతో మొదలైనప్పటికీ, బలమైన మౌత్ టాక్ సినిమాను నిలబెట్టిందని, ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారని మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి 'ధురంధర్' విజయం బాలీవుడ్‌కు కొత్త ఊపిరి పోయడమే కాకుండా, ఇండియన్ స్పై సినిమాల స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పింది.
