కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ

కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ

కామారెడ్డి జిల్లా: కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో వీఆర్ఏలు తలపెట్టిన ధర్నాలో ఆయన పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... ఉద్యోగులకు ఇచ్నిన హామీలను కేసీఆర్ తుంగలో తొక్కారని విమర్శించారు. అర్హులైన వీఆర్ఏలకు వీఆర్ఓలుగా ప్రమోషన్ ఇస్తామని, వాళ్లకు జీతాలు పెంచుతామని కేసీఆర్ చెప్పిన ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు నెరవేరలేదని తెలిపారు. రాష్ట్రంలోని ఉద్యోగులకు సమయానికి జీతాలివ్వడానికి కేసీఆర్ కు చేతకాదన్న ఆయన... యాడ్స్ కోసం మాత్రం వందల కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని కేసీఆర్ పై పైర్ అయ్యారు.  

భారత రాష్ట్ర సమితి ముసుగులో యాడ్స్ పేరుతో ఇతర రాష్ట్రాల్లో యాడ్స్ వేయడం సమంజసం కాదన్నారు. ప్రచారానికి వెచ్చించే డబ్బుతో ఉద్యోగులకు జీతాలివ్వొచ్చని తెలిపారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన ఈ పరిస్థితుల్లో కూడా కేసీఆర్ కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.