ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతుల్లేవు: బండి సంజయ్

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతుల్లేవు: బండి సంజయ్

రాజన్న సిరిసిల్ల: అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన వడ్లన్నీ తడిసిపోయాయి.. తడిసిన వడ్లన్నీ కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్లపల్లి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బండి సంజయ్.. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని మండిపడ్డారు.ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరకు ధాన్యం దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బీఆర్ ఎస్ లాగే కాంగ్రెస్ రైతులను మోసం చేస్తుందన్నారు.వెంటనే తడిసిన ధాన్యం తో సహా రైతు పండించిన ప్రతి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. వడ్లు అమ్ముకున్న రైతులకు డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు. 

మేనిఫెస్టో పవిత్ర గ్రంథమన్న కాంగ్రెస్ నేతల్లారా.. వాటిని ఎందుకు అమలు చేయడం లేదని బండిసంజయ్ నిలదీశారు. ఎకరాకు రూ. 14 వేల చొప్పున బోనస్ ఇస్తారా ఇవ్వరా అని ప్రశ్నించాుు. కేసీఆర్ స్కూల్లో కాంగ్రెస్ ట్రైనింగ్ తీసుకుందని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కాంగ్రెస్ రెండు లక్షల రూపాయల రుణమాఫీ డ్రామాలాడుతుందని బండి సంజయ్ విమర్శించారు. పంట నష్టపోతే పరిహారం ఇప్పటికీ అందని దుస్థితి నెలకొందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ ఎస్ లు దొందు దొందే అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్.