కరోనా విష‌యంలో ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంది

కరోనా విష‌యంలో ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంది

ఢిల్లీ: మోడీ నాయకత్వంలో దేశం కోవిడ్ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కుంటుందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. పేద ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వారిని పరిరక్షించుకుంటూనే, 5 ట్రిలియల్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. పేద‌ల కోసం గ‌రీబ్ కళ్యాణ్ యోజన, గరీబ్ అన్న యోజన, గరీబ్ రోజ్ గార్ యోజన వంటి చర్యలు తీసుకొచ్చామని, వన్ నేషన్- వన్ మార్కెట్ , వన్ నేషన్- వన్ రేషన్ కార్డు వంటి విప్లవాత్మక నిర్ణయాలను కేంద్రం తీసుకుంటుందన్నారు. దేశ సరిహద్దులను కాపాడుకుంటూనే, దేశంలోని సమస్యలకు మోడీ ప్రభుత్వం పరిష్కారం చూపిస్తుందని చెప్పారు.

కరోనా ను ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పిన ఆయ‌న‌.. ఆ దిశలో తెలంగాణ రాష్ట్రం పని చేయడం లేదన్నారు. ప్రభుత్వ తీరుపై బీజేపీ ముందు నుంచి పోరాడుతుందని, కరోనా మహమ్మారిపై కేంద్రం ముందు నుంచి హెచ్చరిస్తోందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం పాటించాలని, ఐసిఎంఆర్ నిర్ణయాలను పొగడడమే కాదు, అమలు కూడా చేయాలన్నార‌. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ సమర్ధవంతంగా చేయాలన్నదే త‌మ డిమాండ్ అని ముర‌ళీధ‌ర్ రావు అన్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి అందిన విరాళల దర్యాప్తుకు కేంద్ర హోంశాఖ అంతర్ మంత్రిత్వ శాఖల కమిటీ ఏర్పాటు చేసింద‌ని, మనిలాండరింగ్, ఐటి, తదితర చట్టాల ఉల్లంఘనలపై ఈ క‌మిటీ దర్యాప్తు చేయనుంద‌ని చెప్పారు. ఈడీ ప్రత్యేక డైరెక్టర్ నేతృత్వంలో కమిటీ తన కార్యకలాపాలు నిర్వహించనుందని చెప్పారు.