బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు చురుగ్గా ఏర్పాట్లు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు చురుగ్గా ఏర్పాట్లు

వచ్చే నెలలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు అంతా సిద్దమవుతోంది. వచ్చే అతిథుల కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. హెచ్ఐసీసీలోని నోవాటెల్ లో జూలై 02, 03 తేదీల్లో ఈ సమావేశాలు జరుగనున్నాయి. ముఖ్యనేతలు మినహా.. కొంతమంది నేతలు హైదరాబాద్ కు ముందే రానున్నారు. ఈ క్రమంలో సమావేశానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు రాష్ట్ర నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా 34 కమిటీలను ఏర్పాటు చేశారు. వీరంతా ఆయా పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధానంగా టూరిజం, వంటల కమిటీలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కు వచ్చే గెస్టులకు.. తెలంగాణ వంటకాలను పెట్టాలని నిర్ణయించారు. అంతేగాకుండా.. తెలంగాణ, ఏపీ టూరిజం ప్లేసులను కూడా చూపించాలని భావిస్తున్నారు. 

పుణ్యక్షేత్ర, పర్యాటక ప్రాంతాల సందర్శన :-
ఏపీలోని తిరుపతి, శ్రీశైలం పుణ్యక్షేత్రాలు తెలంగాణలోని యాదగిరి గుట్ట, నాగార్జున సాగర్, రామప్ప దేవాలయం, భద్రాచలం ప్రాంతాలకు తీసుకెళ్లాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. హైదరాబాద్ లోని ప్రముఖ ఆలయంలో ఒకటైన భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయానికి కార్యవర్గ సభ్యులను తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అంతేగాకుండా సాలార్జంగ్ మ్యూజియం, సమతామూర్తితో పాటు నగరంలోని పలు ప్రాంతాలను చూపించాలని భావిస్తున్నారు. ఇందుకు హెచ్ఐసీసీ నోవాటెల్ లో టూరిజం కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఇక జాతీయ కార్యవర్గ సభ్యులకు తెలంగాణ వంటలు రుచి చూపించాలని నిర్ణయం తీసుకుంది. వంటల్లో ప్రావీణ్యం పొందిన వారు బుధవారం హైదరాబాద్ కు రానున్నట్లు సమాచారం. మెనూలో ఉలవచారు, దోసకాయపప్పు, మామిడికాయ తొక్కు, పచ్చిపులుసు, చిక్కుడుకాయ కూర, ఆలుగడ్డ.. భక్షాలు, సర్వపిండి, మురుకులు, సకినాలతో పాటు ఇతర వంటలు ఉండనున్నాయి. చివరి రోజు ఈ వంటలను వడ్డించనున్నారని సమాచారం.