
హాజరుకానున్న మోడీ, అమిత్ షా, నడ్డా
సమావేశాలు జరిగే రెండ్రోజులు రాజ్‌భవన్‌లోనే ప్రధాని మోడీ బస
కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్రాల సీఎంలకు తాజ్‌కృష్ణలో విడిది
వేదికను పరిశీలించిన బీఎల్ సంతోష్, తరుణ్ చుగ్, సంజయ్
హైదరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుంది. జులై 2, 3 తేదీల్లో ఈ సమావేశాలు నిర్వహించాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. మదాపూర్ హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీ, నోవాటెల్ హోటల్ వేదికగా సమావేశాలు జరగనున్నాయి. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సీనియర్ నేతల సమావేశంలో బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించి రెండు, మూడ్రోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అంతకు ముందు సంతోష్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి నోవాటెల్, తాజ్‌కృష్ణ హోటళ్లను సందర్శించారు. సమావేశాలకు ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు మొత్తం 300 మంది హాజరు కానున్నారు. సమావేశాలు జరిగే రెండ్రోజులు ప్రధాని మోడీ రాజ్‌భవన్‌లోనే బస చేయనున్నారు. సీఎంలు, కేంద్ర మంత్రులు తాజ్‌కృష్ణలో బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించుకునే అవకాశాన్ని రాష్ట్ర పార్టీకి ఇవ్వడం సంతోషకరమని, దీన్ని విజయవంతం చేయాలని పార్టీ నేతలను బీఎల్ సంతోష్ కోరారు. సమావేశంలో తరుణ్ చుగ్, బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, ఇంద్రసేనా రెడ్డి, జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కూన శ్రీశైలం గౌడ్, చింతల రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
19 ఏండ్ల తర్వాత హైదరాబాద్‌లో..
2003లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ వైశ్రాయ్ హోటల్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. మళ్లీ 19 ఏండ్ల తర్వాత ఇక్కడ జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఇవే మొదటి సమావేశాలు. కాగా, తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ప్రత్యేక ఫోకస్ పెట్టిందనడానికి ఈ సమావేశాలు ఇక్కడ నిర్వహించడమే నిదర్శనమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గత నెలలో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలు రాష్ట్రంలో పర్యటించడం.. తెలంగాణను హైకమాండ్ సీరియస్‌గా తీసుకుందని ఓ సీనియర్ నేత చెప్పారు. ఇప్పుడు ఏకంగా జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించడంపై పార్టీ రాష్ట్ర నేతల్లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని, పార్టీ క్యాడర్ ఫుల్ జోష్‌లో ఉందన్నారు.
ఇయ్యాల బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు బీజేపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 9 గంటలకు బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. 10 గంటలకు నాగోల్ లోని జై కన్వెన్షన్ హాల్లో ‘‘అమరుల యాదిలో.. ఉద్యమ ఆకాంక్షాల సాధన సభ’ ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమకారులు ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, రవీంద్ర నాయక్, స్వామి గౌడ్, విజయ శాంతి, విఠల్ తదితరులు సుమారు 50 మంది వరకు ఈ సభలో పాల్గొననున్నారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు పలువురు బీజేపీ నేతలు హాజరుకానున్నారు. ఉద్యమకారులతోపాటు అమరవీరుల కుటుంబాలు, మేధావులను ఈ సమావేశానికి రావాల్సిందిగా బీజేపీ ఆహ్వానం పంపింది. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలను సన్మానించనున్నారు.