బీజేపీ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండించిన వివేక్

బీజేపీ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండించిన వివేక్

హైదరాబాద్: బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించబోమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం  మంథని ఆర్డీవో కార్యాలయ ముట్టడికి యత్నించిన బీజేపీ కార్యకర్తలు, రైతులపై పోలీసులు లాఠీ చార్జీ చేయడాన్ని వివేక్ వెంకటస్వామి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి పక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పోలీసులు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలు క్షీణించాయని, రోజురోజుకు మహిళలు, బాలికలపై దాడులు పెరిగిపోతున్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ సర్కార్ కు ఓటమి తప్పదని వివేక్ జోస్యం చెప్పారు. ఇకపోతే కాళేశ్వరం, అన్నారం, సుందిళ్ల, మేడి గడ్డ ప్రాజెక్టు ల బ్యాక్ వాటర్ వల్ల ముంపు గ్రామాల రైతులకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ బీజేపీ కార్యకర్తలు మంథని ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. 

పర్మిషన్ లేదంటూ పోలీసులు బీజేపీ ముట్టడిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ముంపు రైతులకు ప్రభుత్వం నుంచి హామీ వచ్చే వరకు అక్కడి నుంచి కదిలే ప్రసక్తిలేదని బీజేపీ నాయకులు స్పష్టం చేయడంతో... పోలీసులు వారిపై లాఠీ చార్జీకి దిగారు. దీంతో కొంతమంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో కొంత సమయం పాటు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు...  నిరసనకు దిగిన బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.