మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్​, వెలుగు: బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్​ ఆరోపించారు. శుక్రవారం మెదక్​ లో బీసీ జనసభ ఆధ్వర్యంలో ‘బీసీ జనగణన, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.  మెదక్ జిల్లా బీసీ జనసభ అధ్యక్షుడు కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి హాజరైన రాజారాం యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ నరేంద్ర మోడీని  బీసీ అని ప్రచారం చేసి.. బీసీల ఓట్లు దండుకుని అధికారంలోకి రాగానే  మొండి చేయి చూపిందన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించకపోవడం, బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడాన్ని చూస్తే మోడీకి బీసీలపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు హరీశ్​గౌడ్,  ఓయూ జేఏసీ నాయకులు మధు యాదవ్, బీసీ జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార్ సాగర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

పొలంలో పడి యువకుడు మృతి

రామాయంపేట, వెలుగు: మండలంలోని డి.ధర్మారం గ్రామంలో  గురువారం రాత్రి ప్రమాదవశాత్తు పొలంలో ముక్కు ముంచుకుని పడి ఓ యువకుడు చనిపోయాడు. ఎస్సై రాజేశ్​వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన  కట్ట నర్సింలు (23) తమ పొలం వద్దకు వెళ్లి సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ తెలియలేదు. శుక్రవారం ఉదయం మళ్లీ పొలంవద్దకు వెళ్లి గాలించగా  పొలంలో మునిగి శవమై కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డెడ్ బాడీనీ  పోస్టు మార్టం కోసం రామాయంపేట గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల కంప్లైంట్​మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

గంగిరెద్దుల వారిని ఆదుకోవాలి

సిద్దిపేట రూరల్, వెలుగు: గంగిరెద్దుల వారు ఆర్థికంగా అన్ని రంగాల్లో వెనకబడ్డారని, ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను అందించాలని గంగిరెద్దుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిడ్డి కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు.  శుక్రవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జరిగిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. గంగిరెద్దుల పిల్లలకు గురుకుల స్కూళ్లలో అడ్మిషన్ ఇప్పించాలని, డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలని కోరారు. అనంతరం గంగిరెద్దుల సంఘం జిల్లా కొత్త కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మెండి మల్లేశం, ప్రధాన కార్యదర్శిగా అవుల కాశీం, ట్రెజరర్​గా జిడ్డి వెంకటేశం, కార్యదర్శిగా ఆవుల రవీందర్ ను ఎన్నుకున్నారు.

కిసాన్​ కా సలామ్​..

చేర్యాల, వెలుగు:  స్వతంత్ర  భారత వజ్రోత్సవాల సందర్భంగా భారతదేశ పటాన్ని తన పొలంలో వేసి ఓ రైతు  దేశాభిమానాన్ని చాటుకున్నాడు. మండలంలోని నాగపురి గ్రామంలో  జక్కుల తిరుపతి తన సొంత పొలంలో  దేశవాళి  ‘కాలాబట్టి’ నలుపు రంగు వరితో భారతదేశ పటాన్ని వేశాడు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజమైన దేశభక్తి అంటే .. మనం భూమిని రసాయనాలు వాడి కలుషితం చేయకుండా సేంద్రీయ వ్యవసాయం చేసి ఆహార పదార్థాలను పండించడమేనన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ  ఆదర్శంగా నిలుస్తున్న ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ బాటలో నడుద్దామని పిలుపునిచ్చాడు. భారతదేశ సరిహద్దులో రాత్రింబవళ్లు శ్రమిస్తున్న జవాన్లకు ఈ చిత్రపటాన్ని  అంకితమిస్తున్నానని తెలిపాడు. 

జహీరాబాద్ డీఎస్పీకి జాతీయ అవార్డు

జహీరాబాద్, వెలుగు: నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జహీరాబాద్ డీఎస్పీ వి. రఘు జాతీయ స్థాయిలో  ‘హోం మినిస్టర్‌‌‌‌ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ 2022’ కు ఎంపికయ్యారు. నేర ప‌‌రిశోధ‌‌న‌‌లో అత్యుత్తమ ప్రతిభ క‌‌న‌‌బ‌‌ర్చిన‌‌  ఐదుగురు తెలంగాణ పోలీసుల‌‌కు జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు ల‌‌భించింది. అందులో డీఎస్పీ వి.రఘు ఉన్నారు. అవార్డుకు ఎంపికైన సందర్భంగా డీఎస్పీ రఘును జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

స్టూడెంట్లలో దేశభక్తి పెరగాలి

సంగారెడ్డి టౌన్, వెలుగు: స్వాతంత్ర్య యోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములమవుదామని  కలెక్టర్ డాక్టర్ శరత్ పిలుపునిచ్చారు. శుక్రవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్​లో స్వతంత్ర భారత వజ్రోత్సవాల షెడ్యూల్ కమిటీ సభ్యులు జడ్పీ చైర్​పర్సన్​మంజుశ్రీ, అడిషనల్​కలెక్టర్లు వీరారెడ్డి , రాజర్షి షా ఇతర జిల్లా అధికారులతో కలసి ప్రెస్​మీట్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 22 వరకు నిర్వహించే వజ్రోత్సవ కార్యక్రమాలను వెల్లడించారు. జిల్లాలో 3 లక్షల 43 వేల కుటుంబాలకు జాతీయ జెండాలను పంపిణీ చేశామని తెలిపారు. 13న జిల్లా కేంద్రంలో 750 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ, 14న కళాకారుల ప్రదర్శన, 15న  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. 22న ముగింపు కార్యక్రమాలు నిర్వహించేలా కార్యచరణ రూపొందించామన్నారు.  జిల్లాలో 80 వేల మంది ఆరోతరగతి నుంచి పదోతరగతి స్టూడెంట్లకు గాంధీ సినిమాను చూపిస్తూ నాటి ఉద్యమ పరిస్థితులపై అవగాహన కల్పించి దేశ భక్తిని పెంపొందిస్తున్నామన్నారు. జడ్పీ చైర్​ పర్సన్​ మంజుశ్రీ మాట్లాడుతూ  వజ్రోత్సవ కార్యక్రమాలను సక్సెస్ చేసేందుకు అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, సంగారెడ్డి ఆర్డీవో నగేశ్ డీఎస్పీ రవీందర్ రెడ్డి, డీఆర్డీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.


ప్రేమపెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని యువకుడి ఆత్మహత్య

రామాయంపేట, వెలుగు:  మండలంలోని అక్కన్నపేటలో ప్రేమపెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని గురువారం రాత్రి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.  ఎస్సై రాజేశ్​ వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన  పిట్ల శ్రీకాంత్ (22) అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పు కోక పోవడంతో  మనస్తాపం చెంది  ఇంటి పక్కన ఉన్న వేప చెట్టుకు ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. స్థానికులు సమాచారంతో  పోలీసులు వచ్చి పంచనామా నిర్వహించి  డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి నాగమణి కంప్లైంట్​మేరకు కేసు ఫైల్​చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కాంగ్రెస్‌‌తోనే స్వాతంత్ర్యం వచ్చింది

పాపన్నపేట/ నారాయణఖేడ్/కొమురవెల్లి, వెలుగు:  స్వాతంత్రోద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడింది కాంగ్రెస్​ నాయకులేనని డీసీసీ ప్రెసిడెంట్ ​కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు.  శుక్రవారం‘ఆజాదీకా గౌరవ్​యాత్ర’ లో భాగంగా పాపన్న పేట లో నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి  పాదయాత్ర ప్రారంభించారు.  మిన్​పూర్, కొత్తపల్లి, ఏడుపాయల కమాన్​ ఎల్లాపూర్​ మీదుగా మాచవరం వరకు పాదయాత్ర  సాగింది. ఈ  సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ  స్వాతంత్రోద్యమంలో ఎలాంటి పాత్రలేని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఉత్సవాల పేరిట ప్రచార ఆర్భాటం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో మత ఘర్షణలు సృష్టించి లబ్ధిపొందాలని చూస్తోందని ఆరోపించారు.  కిసాన్​సెల్​అధ్యక్షుడు ప్రభాకర్​రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు మహేందర్​రెడ్డి తదితరులు ఉన్నారు.

నారాయణఖేడ్​లో..

‘ఆజాదీకా గౌరవ్ యాత్ర’ లో భాగంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ సురేశ్​ షెట్కార్, మెంబర్​సంజీవరెడ్డి  శుక్రవారం నారాయణఖేడ్ మండల పరిధిలోని హంగిర్గా కె, హంగిర్గా బి, చాప్టా, అల్లాపూర్, నాగపూర్ గ్రామాల్లో పాదయాత్ర  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జాతీయ జెండాలను ఎగరేశారు. 

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. శుక్రవారం ఆజాదీకా గౌరవ్​యాత్ర లో భాగంగా నిర్వహించిన పాదయాత్ర  కొమురవెల్లి నుంచి కొండపోచమ్మ వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ స్వాతంత్ర్యం తెచ్చింది.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.. కాంగ్రెస్​పార్టీయేనన్నారు.  మద్దూరు జడ్పీటీసీ గిరికొండల్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.