సూరత్​లో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం... లోక్ సభ ఎన్నికల్లో ఖాతా తెరిచిన బీజేపీ

సూరత్​లో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం... లోక్ సభ ఎన్నికల్లో ఖాతా తెరిచిన బీజేపీ

సూరత్: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరిచింది. గుజరాత్ లోని సూరత్ లోక్ సభ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సోమవారం మిగతా అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ముకేశ్​ దలాల్ ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన నీలేశ్ కుంభానీ అభ్యర్థిత్వాన్ని ఎన్నికల అధికారి తిరస్కరించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన నేతల సంతకాల్లో అవకతవకలు జరిగినట్టు తేలడంతో రిటర్నింగ్ అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ నుంచి సురేశ్ పడసాల వేసిన మరో నామినేషన్‌ కూడా చెల్లదని ప్రకటించారు. 

సూరత్ లోక్ సభ స్థానానికి ఏడుగురు స్వతంత్రులతో పాటు ఒక బీఎస్పీ అభ్యర్థి నామినేషన్ వేశారు. అయితే, వీరందరూ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ముకేశ్ దలాల్ ఒక్కరే పోటీలో మిగిలారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. కుంభానీ నామినేషన్ ఫారమ్‌ను బీజేపీ ఆదేశానుసారం తిరస్కరించారని కాంగ్రెస్ ఆరోపించింది. దీన్ని హైకోర్టులో సవాలు చేస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది.