అధిక నీటి బిల్లుల వసూలుపై ఖాళీ బిందెలతో బీజేపీ ఆందోళన

అధిక నీటి బిల్లుల వసూలుపై ఖాళీ బిందెలతో బీజేపీ ఆందోళన

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో అధిక నీటి బిల్లులు వసూలు చేస్తున్నారని నిరసిస్తూ.. ఎల్బీనరగ్ లోని జలమండలి కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు. బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందెలు, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జాతీయ రహదారిని దిగ్బంధించడంతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.

టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఎన్నికల ప్రణాళిక కోసమే పని చేస్తోందని సామ రంగారెడ్డి ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ముందు 20 వేల లీటర్ల మంచినీటిని ఉచితంగా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఆ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఉచిత మంచినీటి కొరకు ఆధార్ లింక్ చేసి మీటర్లు అనుసంధానం చేయాలని చెప్పిన ప్రభుత్వం ఎన్నికల తర్వాత మీటర్ల పేరుతో అధిక బిల్లులు వసూళ్లు చేయడం సరికాదని సామరంగారెడ్డి తెలిపారు. మహిళలు పికో పాల్స్,టైలరింగ్ అని చిన్న బోర్డ్ ఇంటికి తగిలించినా వాటికి కమర్షియల్ ట్యాక్సీ కింద వేల కొద్ది బిల్లులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో నీటి సమస్య లేదన్న మంత్రి కేటీఆర్.. ఆయన ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారిందన్నారు. సామాన్యులపై అధిక భారాన్ని మోపి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ బిల్లులు చెల్లించలేదని డ్రైనేజ్ పైప్ లైన్ ను కొబ్బరి బొండాలతో  మూసివేయడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. వెంటనే అధిక నీటి బిల్లుల వసూళ్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.