బీజేపీ విస్తారక్ల సమావేశం.. దక్షిణాది రాష్ట్రాల్లో అధికారమే టార్గెట్

బీజేపీ విస్తారక్ల సమావేశం.. దక్షిణాది రాష్ట్రాల్లో అధికారమే టార్గెట్

దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ సీరియస్గా ఫోకస్ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న నేతలు పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే మెజారిటీ ఎంపీ స్థానాలు గెలవడం, రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా శామీర్పేటలో విస్తారక్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల జరగనున్న సమావేశాలకు 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 92 మంది విస్తారక్ లు హాజరయ్యారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, పార్లమెంట్ నియోజకవర్గాల్లోని బూత్ కమిటీలు, శక్తి కేంద్రాల పనితీరు, విస్తారక్ బాధ్యతలు, విధులు, సమన్వయంపై నాయకులు వారికి దిశా నిర్దేశం చేయనున్నారు.

జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి సతీష్తో పాటు సీనియర్ నేతలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, 110 పార్లమెంట్ ఫుల్ టైమర్స్ హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించేలా  మీటింగ్ లో చర్చించనున్నారు. సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్.. రేపటి ముగింపు సమావేశానికి వస్తారు. 

119 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ కన్వీనర్లు, ఇంచార్జీలు, విస్తారక్ లు, పాలక్ లతో రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ఇతర ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ఎలాంటి కార్యచరణ ఉండాలనే దానిపై చర్చించనున్నారు. బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలు, కేసీఆర్ అవినీతి, కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో చేపట్టాల్సిన ప్రోగ్రాంలపై ప్లాన్ రూపొందించనున్నారు.