అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. రాష్ట్రమంతా బస్సు యాత్రలకు ప్లాన్

అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. రాష్ట్రమంతా బస్సు యాత్రలకు ప్లాన్

తెలంగాణలో పర్యటించేందుకు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా షెడ్యూల్ ఖరారైంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించబోతోంది. గత ఏడాది కూడా నిర్వహించింది. సెప్టెంబర్ 17న నిర్వహించే వేడుకలకు ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరుకానున్నారు. ఈ సభను సక్సెస్ చేసేందుకు బీజేపీ పదాధికారులు సమావేశమయ్యారు. బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సభను సక్సెస్ చేయాలని నిర్ణయించారు. 

ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కమలం పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రమంతా బస్సు యాత్రలు చేపట్టాలని బీజేపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 21 నుంచి బీజేపీ నేతల బస్సు యాత్రలు ప్రారంభంకానున్నాయి. బాసర నుంచి కిషన్ రెడ్డి బస్సు యాత్ర, సోమశిల నుంచి డీకే అరుణ బస్సు యాత్ర ప్రారంభంకానుంది. ఇక ప్రచార కమిటీ రేసులో బండి సంజయ్, డీకే అరుణ ఉన్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టో కమిటీ రేసులో జీ. వివేక్ వెంకటస్వామి పేరు వినిపిస్తోంది. అంతేకాదు.. ఎన్నికల కోసం 22 కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. 

బస్సుయాత్ర కోసం మూడు  రూట్లను బీజేపీ సిద్దం చేసినట్లు తెలుస్తోంది. బాసర, సోమశిల, భద్రాచలం నుంచి బస్సుయాత్రలను ప్రారంభించాలని నిర్ణయించారు. బస్సు యాత్ర సందర్భంగా తెలంగాణను మూడు జోన్లుగా బీజేపీ నాయకులు విభజించారు. 
బాసర జోన్ (ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలు) 
సోమశిల జోన్ (మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు )
భద్రాచలం జోన్  (ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జోన్ )
హైదరాబాద్ లో మూడు బస్సు యాత్రలు ముగియనున్నాయి. హైదరాబాద్ లో ముగింపు సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. 19 రోజులు పాటు నాలుగు వేల కిలోమీటర్ల మేర బీజేపీ నాయకుల బస్సుయాత్రలు సాగనున్నాయి.