
- కదనానికి కమలం
- ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్న కాషాయసేన
- 119 సెగ్మెంట్లలో ఉత్తరాది ఎమ్మెల్యేల పరిశీలన
- లోటు పాట్లు గుర్తించి అధిష్టానానికి సీక్రెట్ రిపోర్ట్
- ఈ నెల 27న ఖమ్మం నగరానికి కేంద్ర మంత్రి అమిత్ షా
- వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
- బీఆర్ఎస్ అసంతృప్తులను చేర్చుకొనేందుకు మరో ప్లాన్
- 20 మందితో టచ్ లోకి వెళ్లిన బీజేపీ ముఖ్యనేతలు
- గెలుపే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతల కార్యాచరణ
హైదరాబాద్ : కమలం పార్టీ ఎన్నికల కదనానికి రెడీ అవుతోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి గెలుపు వరకు పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలోని 119 సెగ్మెంట్లలో ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు పర్యటించి లోటుపాట్లను అభ్యర్థుల బలాబలాలను పరిశీంచనున్నారు. శనివారం (ఆగస్టు 19న) మధ్యాహ్నం వివిధ రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు చేరుకున్నారు.
సికింద్రాబాద్ లోని క్లాసిక్ గార్డెన్స్ లో నిర్వహించనున్న వర్క్ షాపులో వారు పాల్గొంటున్నారు. రేపటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు రాష్ట్రంలో వారికి కేటాయించిన సెగ్మెంట్లలో పర్యటించనున్నారు. ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గోవా,పాండిచ్చేరి, కర్నాటక రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు ఈ బృందంలో ఉన్నారు.
నియోజకవర్గాలకు వెళ్లే ఎమ్మెల్యే లు గెలుపు అవకాశాలు..? పార్టీ సంస్థాగత నిర్మాణం.. నాయకుల పనితీరు.. తాజా రాజకీయ పరిస్థితులపై హైకమాండ్ కు నివేదిక అందించనున్నారు. వీటితోపాటు రాష్ట్ర శాఖ నుంచి వచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపిన ఎమ్మెల్యేలు ఇచ్చిన నివేదికను పరిశీలించిన మీదటే అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధినాయకత్వం ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ అభ్యర్థుల విషయాన్ని తేల్చలేదు.
తొలి జాబితా ఎప్పుడు..?
బీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టినట్టు సమాచారం. దాదాపు 20 మంది కీలక నేతలు కమలం పార్టీ పెద్దలతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ టికెట్ కేటాయించని పక్షంలో కారు దిగేందుకు రెడీ అవుతున్నారు. డౌట్ ఫుల్ గా ఉన్న కొందరు నేతలు ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకులతో టచ్ లోకి వెళ్లినట్టు సమాచారం. బీఆర్ఎస్ తొలిజాబితా ప్రకటించిన తర్వాతే బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఉండే అవకాశం ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
క్యాడర్ లో జోష్ నింపేందుకు
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తర్వాత క్యాడర్ లో కొంత స్తబ్ధత నెలకొన్నట్టు పార్టీ గుర్తించింది. అగ్రనేతలు మోదీ, షా పర్యటనల ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 27న ఖమ్మంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు కొందరు కాషాయ కండువా కప్పుకొనే అవకాశం ఉందని సమాచారం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్వహించే సభకు హాజరు కానున్నారని సమాచారం. ఈ మేరకు ప్రధానిని పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. గతేడాది విమోచన దినోత్సవ సభకు అమిత్ షా హాజరైన విషయం తెలిసిందే. ఈ సారి మోదీ రానున్నారు. వీళ్లిద్దరి పర్యటనలు క్యాడర్ లో కొత్త జోష్ తీసుకొస్తాయని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.