సర్వేల ఆధారంగానే టికెట్లు : తరుణ్ చుగ్

సర్వేల ఆధారంగానే టికెట్లు : తరుణ్ చుగ్
  • బీజేపీ జాయినింగ్ కమిటీ సమావేశంలో తరుణ్ చుగ్
  • లాబీయింగ్ లు నడువవని వెల్లడి
  • పార్టీలోకి చేరికలను స్పీడప్ చేయాలని నేతలకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు : రాబోయే ఎన్నికల్లో టికెట్ల కోసం లాబీయింగ్ లు నడువవని, కేవలం సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, పార్టీకి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బలమైన అభ్యర్థులు ఉండేలా ఇప్పటి నుంచే కసరత్తు చేయాలని సూచించారు. ప్రతి సెగ్మెంట్​లో బీఆర్ఎస్ అభ్యర్థులను దీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న క్యాండిడేట్​కావాలని.. ఆ దిశగా చేరికలను స్పీడప్ చేయాలని నేతలను ఆదేశించారు. బుధవారం శామీర్ పేటలోని ఓ రిసార్టులో పార్టీ చేరికల కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే  ఈటల రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్​లో తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ, గరికపాటి మోహన్ రావు, చంద్రశేఖర్, దుగ్యాల ప్రదీప్ పాల్గొన్నారు.

మాస్ ఫాలోయింగ్ ఉంటే టికెట్ హామీ ఇయ్యాలె

రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీకి బలమైన అభ్యర్థులు ఎక్కడ లేరో గుర్తించి, వెంటనే అక్కడ ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను చేర్చుకోవాలని తరుణ్ చుగ్ సూచించారు. మంచి ఛరిష్మా, మాస్ ఫాలోయింగ్ ఉంటే వారికి టికెట్ హామీ ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో సమయం వృథా చేయొద్దని కమిటీ మెంబర్స్​ను తరుణ్ చుగ్ ఆదేశించారు. అలాగే, ఆ సెగ్మెంట్​లో టికెట్ ఆశించే పార్టీ సీనియర్లు ఎలాంటి అసంతృప్తికి గురికాకుండా వారిని ఒప్పించే బాధ్యతను రాష్ట్ర నేతలు తీసుకోవాలన్నారు. బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఇతర పార్టీల కీలక నేతలను నేరుగా ఢిల్లీకి తీసుకురావాలని చేరికల కమిటీకి సూచించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లోని అసంతృప్త నేతలతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ.. వారిని బీజేపీలోకి ఆహ్వానించాలన్నారు. 

నిత్యం ప్రజల్లో ఉండాలె 

పార్టీ నాయకులు నిత్యం ప్రజల్లో ఉండాలని తరుణ్ చుగ్ సూచించారు. బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుపై ఉద్యమాలు చేయాలన్నారు. అదే సమయంలో ఇంటింటికీ వెళ్లి తెలంగాణకు మోడీ సర్కార్ ఏ స్కీమ్​ కింద ఎన్ని ఫండ్స్​ ఇచ్చిందో జనాలకు వివరించాలన్నారు. అనంతరం ఈ మధ్య చేరికల కమిటీని ఇతర పార్టీల నేతలు ఎవరు సంప్రదించారు? వారి చేరికలకు ఉన్న అడ్డంకులేంటి? వారి చేరికతో ఆ సెగ్మెంట్​లో బీజేపీ ఏ స్థాయిలో బలోపేతం అవుతుందనే విషయాలపై ఢిల్లీ నేతలు ఆరా తీశారు. చేరికలకు సంబంధించి కమిటీ.. సునీల్ బన్సల్, తరుణ్​ చుగ్ లకు రిపోర్టును అందజేసింది.